సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్న దర్శక నిర్మాతగానే కాకుండా ఒక చిత్రంలో మెయిన్ విలన్ పాత్రను కూడా పోషించిన తమ్మారెడ్డి భరద్వాజ పేరు చిరపరిచయమే. ఆయన తీసే సినిమాలన్నీ సామాజిక అంశాలపైనే ఉంటాయి. తన కెరీర్‌లో మూడు నాలుగు బంపర్‌హిట్స్ కూడా ఉన్నాయి. అయినా మంచి సందేశాత్మక చిత్రాలను మాత్రమే తీస్తాడనే పేరు వచ్చినా, ఆయన తీసిన పలు చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందలేక దర్శకునిగా, నిర్మాతగా ఆయనకు ఆర్ధికంగా ఎంతో నష్టాన్నే కలిగించాయి. ఇక ఆయనకు కార్మిక పక్షపాతిగా పేరుంది. ఆయన సినీ కార్మికుల కోసం ఇప్పటికీ కృషి చేస్తున్నాడు.
చిరంజీవి, సుమన్, భానుచందర్ వంటి ఎందరికో ఆయన వారి కెరీర్ ప్రారంభంలోనే మంచి లిఫ్ట్ ఇచ్చి, వారితో సినిమాలు చేశాడు. ఇలా టాలెంట్ ఎక్కడా ఉన్నా ఆయన ఎప్పుడు ప్రోత్సహిస్తూనే వచ్చాడు.ఏ విషయంపైన అయినా కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని చెప్పే ఆయన తాజాగా చిరు-పవన్‌ల విషయం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 'నా ఆలోచన' పేరుతో ఆయన యూట్యూబ్‌లో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ దేశంలో ఎవరు కలిసిమెలసి సుఖంగా, సంతోషంగా ఉన్నా వాటిని చాలా మంది ఓర్వలేకపోతున్నారు. చిరంజీవి ఎంతో కష్టపడి మెగాస్టార్‌గా స్వయంకృషితో ఎదిగాడు. ఆయనకు తన తమ్ముళ్లనా, ఫ్యామిలీ అన్నా ప్రాణం. ముఖ్యంగా పవన్ అంటే చాలా చాలా ఇష్టం. ఇక పవన్ కూడా తన అన్నయ్యకు ఎంతో గౌరవం ఇస్తారు. పవన్ 'ఖుషీ'లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన తర్వాత చిరుతో సమానమైన ఇమేజ్ సంపాదించాడు. 'ఖుషీ' చిత్రం సూపర్‌హిట్ అయినప్పుడు చిరు ఎంతో ఆనందపడ్డాడు.
పవన్ ఆ చిత్రంలో ఫైట్స్ అద్భుతంగా చేశాడని పొంగిపోయాడు. దాంతో తన తదుపరి చిత్రం 'డాడీ'కి ఆయన పవన్ చేతనే ఫైట్స్ కంపోజ్ చేయించుకున్నాడు. చిరు లేనిదే వవన్ లేడనేది కూడా వాస్తవం. ఇక ఇద్దరి భావజాలాలు వేరుగా ఉండవచ్చు. అంత మాత్రాన వారు విడిపోవాలని కోరుకోవడం, విడిపోయారని ప్రచారం చేయడం తప్పు. భావజాలం వేరైనంత మాత్రాన వారు విడిపోవాలా? కత్తులు దూసుకోవాలా? చెప్పండి. ఇప్పటికీ ఈ అన్నదమ్ములు ఎంతో సయోధ్యగా ఉంటారు. రాజకీయ దారులు వేరైఉండవచ్చు. వీలైతే వారి మధ్య మరింత ప్రేమ కలిగించండి. అంతేగానీ దయచేసి విడగొట్టేలా చేయకండి.. ఆ ప్రచారాలను ఆపండి... అని కోరాడు. ఈ విషయంలో తమ్మారెడ్ది చెప్పిన ప్రతి అక్షరం అక్షరసత్యమనే చెప్పాలి.