మిల్కీబ్యూటీ తమన్నాను మీడియా వారు తరచుగా అడిగే ప్రశ్న ఏమిటంటే.. మీ పెళ్లెప్పుడు అనే. కాగా ఆమె ఇప్పుడే నాకేంటి పెళ్లి? చేసుకుంటే మీకు చెప్పే చేసుకుంటాను అని సాధారణంగా అందరి హీరోయిన్లలాగే రొటీన్ సమాధానమే చెబుతుంది. మరి అలాంటి తమన్నాకు త్వరలో పెళ్లిచూపులు జరగనున్నాయి. ఈ వార్త కన్‌ఫర్మ్ అయింది. అయితే ఇది నిజజీవితంలో కాదు.. వెండితెరపైనే. విషయానికి వస్తే తరుణ్‌భాస్కర్ అనే నూతన దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించిన చిన్న చిత్రం 'పెళ్లిచూపులు' టాలీవుడ్‌లో పెద్దహిట్టు కావడంతో పాటు ఓవర్‌సీస్‌లో కూడా కలెక్షన్లు కొల్లగొట్టింది. విజయ్‌దేవరకొండ, రీతూవర్మల కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రంపై పలు భాషల దర్శకనిర్మాతల కన్నుపడింది. ఈ చిత్రం తమిళ, మలయాళ వెర్షన్స్ రీమేక్ హక్కులను కూడా క్రియేటివ్ దర్శకుడు గౌతమ్‌మీనన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆయనే నిర్మించడమే కాకుండా ఆయనే దర్శకత్వం వహిస్తాడనే ప్రచారం కోలీవుడ్‌లో జరిగింది. కాగా ఈ చిత్రానికి గౌతమ్ కేవలం నిర్మాతగా మాత్రమే ఉండి.. తన సహాయదర్శకుడైన సెంథిల్‌రామస్వామికి దర్శకత్వ బాధ్యతలను అప్పగించాడు. తెలుగులోలాగా ఈ చిత్రాన్ని ఎలాంటి పేరు లేని హీరోహీరోయిన్లను తీసుకోవడం, లోబడ్జెట్‌లో తీయడం కాస్త రిస్క్ అని ఆలోచించాడు. దాంతో హీరోయిన్ పాత్రకు తమిళ, మలయళ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపు ఉన్న తమన్నాను, హీరోగా మలయాళ 'ప్రేమమ్' హీరో నవీన్‌పౌల్‌ను తీసుకున్నారని సమాచారం. తమన్నా విషయాన్ని దృవీకరించిన గౌతమ్ హీరో విషయాన్ని మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రాన్ని మంచి బడ్జెట్‌తో క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా రిచ్‌గానే తీయాలని ప్లాన్ చేశాడు. దీన్ని తమిళంతో పాటు ఒకేసారి మలయాళంలో కూడా నిర్మించనున్న ఆయన మలయాళంలో 'ప్రేమమ్'తో మంచి గుర్తింపును తెచ్చుకున్న నవీన్‌పౌల్‌నే పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో తమన్నాతోపాటు నవీన్‌పౌల్ చేస్తే సినిమాకు ఎలాంటి రిస్క్ ఉండదని ఖచ్చితంగా చెప్పవచ్చు.