మంచి చిత్రాలు వస్తే ఖచ్చితంగా అందరూ మెచ్చుకుంటారు. బాగున్న సినిమాను కూడా బాగాలేదని, బాగాలేని సినిమాను బాగుందని రాస్తే మీడియాకు మరీ ముఖ్యంగా వెబ్‌సైట్ల క్రెడిబిలిటీ పోతుంది. దాంతో విమర్శలతో పాటు ఈ సైట్స్‌కు ఆదరణ కూడా తగ్గుతుందనేది వాస్తవం. ఈవిషయం అందరికీ, మరీ ముఖ్యంగా వెబ్‌సైట్ల నిర్వాహకులకు, రివ్యూలు రాసే జర్నలిస్ట్‌లకు కూడా తెలుసు. అలా తప్పుగా రాస్తే వచ్చే ఆదాయం కన్నా, దీర్ఘకాలంలో జరిగే దుష్పరిణామాలు కూడా వారికి తెలుసు. అందుకే ఎవ్వరూ చేజేతులారా.. డబ్బులకు ఆశపడి ఇలాంటి రివ్యూలు, ఆర్టికల్స్ రాయరు. మంచి సినిమాలుగా వచ్చిన 'ఎక్కడికిపోతావు చిన్నవాడా, పెళ్లిచూపులు, బిచ్చగాడు' వంటి వాటితో పాటు తాజాగా వచ్చిన 'దంగల్, అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాలను కూడా రివ్యూలలో అందరూ మెచ్చుకుంటూనే మంచి రేటింగ్స్ కూడా ఇచ్చారు. ఇక వెబ్‌సైట్స్‌కి రివ్యూలు రాయడంలో వచ్చే ఇబ్బందులను కూడా అందరూ అర్ధం చేసుకోవాలి. సినిమా విడుదలైన వారం, పదిరోజుల వరకు ఆగితే ఆ చిత్రం కలక్షన్లు ఎలా ఉన్నాయి? ప్రేక్షకుల అభిప్రాయాలు ఏమిటి? ఆ చిత్రం ఏ వర్గాన్ని ఎక్కువగా ఆకర్షిస్తోంది? వంటివన్నీ తెలిసిపోతాయి. కానీ సినిమా విడుదలైన గంటల వ్యవధిలోనే రివ్యూలు రాయడం, రివ్యూలు రాసేవారి ఆలోచనలకు బిన్నంగా ఉండే కొన్ని రొటీన్ సినిమాలను ప్రేక్షకులు రోజులు గడిచే కొద్ది ఆదరించడం మొదలెట్టడం కూడా జరుగుతోంది. వాస్తవానికి బన్నీ నటించిన 'సరైనోడు', ఎన్టీఆర్ 'జనతాగ్యారేజ్' వంటి చిత్రాలపై మొదటి రోజు అభిమానులు కూడా పెదవి విరిచారనేది వాస్తవం. కానీ లాంగ్‌రన్‌లో యావరేజ్ చిత్రాలైన ఇవి పబ్లిసిటీ, ప్రమోషన్స్‌తో పాటు మరే చిత్రాలు పోటీ లేకపోవడం వంటి కారణాల వల్ల పెద్ద బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. చిత్రవిచిత్రమైన రంగుల ప్రపంచమైన సినిమా ఫీల్డ్‌లో ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఏ చిత్రం హిట్టవుతుందో? ఆయా చిత్రాల దర్శకనిర్మాతలు, తలపండిన హీరోలకు కూడా అర్ధం కాదు. అంతేగానీ ఓ చిత్రానికి తక్కువ రేటింగ్ ఇచ్చారని, బాగా రాయమని నిర్మాతలు డబ్బులు ఇవ్వకపోవడం వల్లే ఇలా రాశారని భావించడం మూర్ఖత్వమే అవుతుంది. కొన్ని చిత్రాల యాడ్స్ తమ తమ వెబ్‌సైట్లకి ఇచ్చినా కూడా, కేవలం యాడ్ ఇచ్చారనే పక్షపాతంతో బాగాలేని ఆ చిత్రాన్ని బాగుందని కూడా రాయడానికి ఎవ్వరూ సాహసించరు. దీనిపై ఎక్కడైనా ఎవరితోనైనా చర్చకు పలువురు జర్నలిస్ట్‌లు, రివ్యూ రైటర్స్ సిద్దంగా ఉన్నారు.
తాజాగా దాసరి 'అప్పట్లో ఒకడుండేవాడు' సక్సెస్‌మీట్‌లో మరోసారి మీడియాపై విరుచుకుపడ్డారు. సినిమా ఇండస్ట్రీ వారిని కొందరు రేటింగ్‌లతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, ఇలా బ్లాక్‌మెయిల్ చేస్తూ పోతే ఎవ్వరు ఎంతో కాలం భరించరని వ్యాఖ్యానించాడు. మరోపక్క 'అప్పట్లో ఒకడేండేవాడు'కి మీడియా బాగా సపోర్ట్ చేసిందని చెబుతూనే ఇలా కామెంట్స్ చేయడం చూస్తే నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించిన విధంగా ఉంది. ఆయన ఇంకా మాట్లాడుతూ, మీరిచ్చే రేటింగ్‌ల మీద ఎన్నో జీవితాలు ఆధారపడి ఉన్నాయని, ఓవర్‌సీస్‌లో మీరిచ్చే రేటింగ్‌లు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మండిపడ్డారు. త్వరలో తాను గుడ్‌ఫిల్మ్ ప్రమోటర్స్ అనే పేరుతో 6మందితో టీమ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నానన్నాడు. ఆయన దాంతో పాటు ఓ వెబ్‌సైట్‌ను కూడా పెట్టి సుదీర్ఘ తన అనుభవంతో ఆయనే సరైన రేటింగ్‌లు ఇస్తే.. బాగుంటుంది. ఆయనకు ఆ ఆర్ధికస్థోమత కూడా ఉంది. అలా చేసి ఆయనే పర్‌ఫెక్ట్ రేటింగ్‌లు ఇస్తే ఎంతో మంచిపని చేసినవారు అవుతారు. తన సినిమాలపై తనకే జడ్జిమెంట్ లేక సతమతమవుతున్న ఈ దర్శకరత్న తీసిన 'పరమవీరచక్ర, ఎర్రబస్సు' వంటి చిత్రాలకు కూడా మంచి రేటింగ్‌లు ఇవ్వాలని ఆయన ఉద్దేశ్యం కాబోలు. మరి 'అప్పట్లో...' చిత్రానికి మంచి రేటింగ్‌లు ఇవ్వడానికి ఎవరికి ఎంత ఇచ్చాడో ఆ వేదికపైనే ఉన్న హీరో కమ్ ప్రొడ్యూసర్ నారారోహిత్ చేతే చెప్పించి ఉంటే బాగుండేది. మరి కొందరు మీడియా వారు కొందరికి కొమ్ముకాస్తున్నారని కూడా ఆయన గతంలో వ్యాఖ్యానించాడు. మరి ఆయన స్వయంగా స్థాపించిన 'ఉదయం' దినపత్రిక, 'మేఘసందేశం, శివరంజని' వంటి సినిమా వారపత్రికలలో ఆనాడు పనిగట్టుకొని కొందరిని చులకన చేసి, మరికొందరు పెద్దలకు తన సొంత అవసరాల కోసం, రాజకీయ మనుగడ కోసం పనిగట్టుకొని భజన చేసిన విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్‌లను అడిగితే ఎవరైనా చెప్పగలరు.