మహేష్‌బాబు హీరోగా 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని తీసి దారుణ ఫలితాలను పివిపి సంస్థ చవిచూసింది. కాగా ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో పివిపికి వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తానని మహేష్ మాట ఇచ్చాడు. కానీ పలు కారణాల వల్ల ఆయన ఈ చిత్రాన్ని పివిపికి చేయకుండా వంశీతోనే దిల్‌రాజు-అశ్వనీదత్‌ల భాగస్వామ్యంలో చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. దర్శకుడు వంశీ గతంలో పివిపి బేనర్‌లో 'ఊపిరి' చిత్రం చేశాడు. ఆ సమయంలోనే వంశీ టాలెంట్ నచ్చి పివిపి సంస్థ ఆయనతో మరో చిత్రానికి కూడా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కానీ మహేష్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వంశీకి పెద్ద తలనొప్పిగా మారింది. వాస్తవానికి ఈ వివాదంలోకి వంశీని లాగడం బాధాకరమనే చెప్పాలి. కానీ ఇప్పటికే పవన్‌తో వైరం పెట్టుకున్న పివిపి, మహేష్‌పై ఫిర్యాదు చేసే దమ్ములేక ఏ పాపం తెలియని వంశీని ఇబ్బందిపెడుతున్నాడు. ఇలా వివాదానికి ముఖ్యకారకుడైన మహేష్‌ను వదిలేసి వంశీని వేధించడంపై పలు విమర్శలు వస్తున్నాయి. కాగా వంశీ పైడిపల్లి తన తదుపరి చిత్రాన్ని ఖచ్చితంగా తమ సంస్ధలోనే చేయాలని, లేకపోతే 'ఊపిరి' చిత్రానికి వచ్చిన నష్టం మొత్తాన్ని వంశీ తమకు చెల్లించాలని పివిపి నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయడమే కాదు.. ఏకంగా చెన్నై హైకోర్టులో పిటిషన్ వేసి, ఇంజక్షన్ ఆర్డర్స్‌ను కూడా తెచ్చాడు. హైకోర్టు కూడా పివిపిసంస్థలో మహేష్ కోసం తయారు చేసిన కథను దర్శకుడు వంశీపైడిపల్లి గానీ, రచయితలు హరికృష్ణ, సోలోమన్‌లు గానీ వేరొక్కరితో చేయరాదంటూ తమ ఇంజక్షన్ ఆర్డర్‌లో పేర్కొంది.
మరో విశేషం ఏమిటంటే... 'ఊపిరి' చిత్రం కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచిందని పలు వెబ్‌సైట్లు రాస్తే, వాటిని పివిపి సంస్థతో పాటు నాగార్జున కూడా తప్పుపట్టి, తమ చిత్రానికి పెద్ద మొత్తంలో కలెక్షన్లు, లాభాలు వచ్చాయని ప్రకటించుకున్నారు. మరి అదే లాభాలను ప్రకటించిన పివిపి ఇప్పుడు మాత్రం ఆ చిత్రానికి భారీ నష్టాలు వచ్చాయని, వాటిని వంశీనే తీర్చాలని సెలవిస్తున్నాడు. అంటే మన హీరోలు, దర్శకనిర్మాతలు చెప్పే కలెక్షన్లలు ఎంత ఫేక్‌గా ఉంటాయో ఈ ఒక్క ఘటన నిరూపిస్తోంది. ఇక ఈ విషయంలో నాగ్ కూడా నోరు మెదపడం లేదు. 'ఊపిరి'కి లాభాలు వచ్చాయా? లేక నష్టాలు వచ్చాయా? అనే విషయాన్ని బహిర్గతం చేయాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. కానీ మహేష్, నాగ్‌లు మౌనంగా ఉంటే పివిపి మాత్రం దర్శకుడైన వంశీపైడిపల్లినే టార్గెట్ చేస్తుండటం విడ్డూరం. దీనిపై తాజాగా వంశీ మాట్లాడుతూ, పివిపి చెబుతున్నట్లు 'ఊపిరి'కి భారీ నష్టాలు రాలేదని, ఈ సమస్యను తాను కూడా న్యాయపరంగానే ఎదుర్కొంటానని తెలిపాడు.