ఇటీవల 'వంగవీటి' చిత్రంతో వార్తల్లో నిలిచిన వర్మ ప్రస్తుతం బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని ఆకాశానికి ఎత్తుతూ, చిరు నటించిన 'ఖైదీ...' చిత్రంపై సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. మరోపక్క ఆయన తనకు దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిన 'సర్కార్' సీరిస్‌లో భాగంగా 'సర్కార్ 3' చిత్రం షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. పాత్రలన్నింటిని ఒకేసారి పరిచయం చేశాడు. ఈ లుక్స్, మరీముఖ్యంగా అమితాబ్ లుక్‌ను చూస్తే ఇవి వర్మ శైలిలోనే ఉన్నాయని స్పష్టంగా అర్ధమవుతోంది. బిగ్‌బి తన ఫస్ట్‌లుక్‌లో మెడలో రుద్రాక్షలు ధరించి, నల్ల దుస్తులు వేసుకొని, సాసర్‌లో టీ తాగుతూ, కళ్లజోడులో నుంచి కంటిచూపుతో అన్నింటినీ కంట్రోల్ చేసే లుక్‌లో, ఐ పవర్‌తోనే భయపెడుతూ, బీభత్సంగా భయపెట్టేస్తున్నాడు. ఈ లుక్‌లో బిగ్‌బిని చూస్తే ఆయన మరోసారి ప్రేక్షులను మెస్మరైజ్ చేయడం ఖాయమనే ప్రశంసలు లభిస్తున్నాయి. కాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌తో పాటు విడుదల తేదీని కూడా వర్మ అప్పుడే ప్రకటించేశాడు. మార్చి17న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన కన్‌ఫర్మ్ చేశాడు. ఇక ఈ చిత్ర టీజర్‌ను ఈనెల 23న విడుదల చేయనున్నాడు. ఈ తేదీకి ఓ ప్రత్యేకత కూడా ఉంది. సర్కార్‌లోని బిగ్‌బి పాత్రకు స్ఫూర్తి అయిన శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాకరే జయంతి ఆరోజే కావడం విశేషం. ఈ చిత్రం తర్వాత ఆయన 'న్యూక్లియర్' చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. దీని చిత్రీకరణకు కనీసం రెండు, మూడేళ్లు పడుతుందని ఆయన తెలిపాడు. ఇక తాను తమిళనాడు అమ్మ స్వర్గీయ జయలలిత ప్రియసఖి, ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీకి ప్రధానకార్యదర్శిగా ఎన్నికైన శశికళపై ఓచిత్రం చేయనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. కాగా 'శశికళ' పేరుతోనే తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని తమిళనాడు తదుపరి అసెంబ్లీ ఎన్నికలు జరిగే 2021 నాటికి ఎన్నికల వేడి ఉన్న సమయంలో రిలీజ్ చేస్తానని మాట ఇచ్చాడు. ఇక 'సర్కార్3' చిత్రంలో అభిషేక్‌బచ్చన్, ఐశ్వర్యారాయ్ పాత్రలకు తావులేకపోవడంతో వారిని ఈ చిత్రంలో తీసుకోలేదన్నాడు. మొత్తానికి 'సర్కార్3' తో వర్మ బాలీవుడ్‌లో బౌన్స్ బ్యాక్ అయి సంచలనం సృష్టించడం ఖాయమని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.