సంక్రాంతి పండుగ మరో ఐదారు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి', చిరు 'ఖైదీ నెంబర్ 150'తో ఒక్కరోజు గ్యాప్‌లో యుద్దానికి తలపడుతున్నారు. ఆ తర్వాత కూడా వెంకీ నటించిన 'గురు', నాగ్ చేసిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాలు విడుదలకానున్నాయి. ఉగాది కానుకగా పవన్ 'కాటమరాయుడు'తో పాటు త్రివిక్రమ్‌తో చేసే చిత్రం కూడా ఇదే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక మహేష్-మురుగదాస్‌ల చిత్రం, ఎన్టీఆర్ -బాబిల మూవీ, బన్నీ 'డిజె', ప్రభాస్-రాజమౌళిల 'బాహుబలి-ది కన్‌క్లూజన్' వంటి చిత్రాలతో పాటు చరణ్-సుక్కుల కాంబోతో పాటు స్టార్స్ మహేష్, ఎన్టీఆర్, బాలయ్య, నాగ్, వెంకీ తదితరులు నటించనున్న చిత్రాలను కూడా ఇదే ఏడాది లైన్‌లోకి తేవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. తదుపరి చిత్రాలు కొన్ని ఇంకా ప్రారంభమే కాకపోయినా షూటింగ్‌లను నాలుగైదు నెలల్లో స్పీడ్‌గా పూర్తి చేసి విడుదల చేయాలని స్టార్స్ కూడా భావిస్తున్నారు. ఇక శంకర్-రజనీల '2.0'తో పాటు దాదాపు డజనుకు పైగా పెద్ద చిత్రాలు ఈ ఏడాదిలో విడుదలయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా మోదీ తాజాగాతీసుకున్న బ్లాక్‌మనీని అరికట్టే చర్యల్లో భాగంగా, ప్రస్తుతం పాతనోట్లను రద్దు చేయడం మొదటి అడుగేనని, త్వరలోనే అంటే ఈ ఏడాదిలోనే ఆయన మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో పక్క ఆమధ్య వచ్చిన పవన్ 'సర్దార్‌గబ్బర్‌సింగ్', మహేష్ 'బ్రహ్మోత్సవం' వంటి చిత్రాలతో పాటు మరికొన్ని భారీ చిత్రాలు కూడా డిజాస్టర్స్‌గా నిలిచి, భారీ రేట్లకు కొన్న బయ్యర్లకు తీవ్రనష్టాలను మిగిలించాయి. చివరకు రజనీ చేసిన 'కొచ్చాడయాన్, లింగా, కబాలి' వంటి డబ్బింగ్ చిత్రాలు కూడా బయ్యర్లను నిలువునా ముంచాయి. దీంతో పలు భారీ చిత్రాలను కొన్న బయ్యర్లు తమకు నిర్మాతలు, హీరోలు నష్టాలను రికవరీ చేయాలంటూ ఆందోళనలు సైతం సాగించారు. స్టార్‌హీరోలతో భారీ బడ్జెట్‌తో సినిమాలను నిర్మించే నిర్మాతలు, స్టార్స్ కూడా తాజాగా బయ్యర్లు వైట్‌మనీనే ఇవ్వాలని, చిత్రం జయాపజయాలకు, వాటి నష్టాలకు తాము ఎలాంటి బాధ్యత లేదని సినిమా అమ్మకాల సమయంలోనే వారి చేత అగ్రిమెంట్ రాయించుకుంటున్నారు. దీంతో తమ తమ అభిమాన హీరోల చిత్రాలు చాలా రానున్నాయని అభిమానులు సంతోషపడుతుంటే.. బయ్యర్లు మాత్రం ఒక్కప్పటి బెట్టింగ్ చేయాలంటే భయపడుతున్నారు అనేది వాస్తవం.