టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా అతి తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్న వి.వి. వినాయక్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ల్యాండ్ మార్క్ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా వుంది. ఇక 'ఖైదీ...' రిలీజ్ సందర్భంగా విలేఖరులకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వినాయక్ తన మనసులోని మాటలను బయటపెట్టాడు. ఈ 'ఖైదీ....' చిత్రం తనకు చిరంజీవిగారిచ్చిన ఒక మహదావకాశం అని..... ఈ చిత్రాన్ని డైరెక్ట్ చెయ్యడం తన అదృష్టమని అంటున్నాడు. ఇక తనకి డైరెక్టర్ రాజమౌళి, పూరి జగన్నాథ్ లు అత్యంత ఆప్తులని చెప్పాడు.
ఎప్పుడూ రాజమౌళి ఇంటికి వెళ్లినా కూడా వినాయక్ గారొచ్చారు అంటూ ఆహ్వానిస్తారని... కీరవాణి గారికి కూడా నేనంటే ఇష్టమని చెప్పాడు. ఇక పూరి లాగా నేను కూడా ఎప్పుడు హ్యాపీ గా ఉండాలని కోరుకుంటానని చెప్పాడు. పూరి జగన్నాథ్ ఎప్పుడు కూల్ గా వుంటాడని, భయం లేకుండా సంతోషంగా, బిందాస్ గా బ్రతికేస్తాడని చెప్పుకొచ్చాడు. అలా ఉండడం అంటే నాకు చాలా ఇష్టమని....ఇక తనకు మళ్ళీ జన్మంటూ ఉంటే పూరి జగన్ లా పుట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
ఇక 'ఖైదీ...' చిత్రం గురించి మాట్లాడుతూ... తనని చిరు గారు ఒకసారి పిలిచి కత్తి తమిళ మూవీ చూసావా.... అని అడిగితే.. చూశా కానీ.. దీక్షగా, పరిశీలనగా చూడలేదని చెబితే.... ఒకసారి నన్ను మదిలో పెట్టుకుని ఆ చిత్రం మళ్ళీ చూడు అని చెప్పి పంపారు. ఇక నేను కత్తిని పూర్తి దృష్టితో చిరంజీవి గారిని ఊహించుకుంటూ చూసి మళ్ళీ చిరంజీవి గారిని కలవగా ఆయన మనమిద్దరం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పగా నాకు ఎగిరి గంతేసినట్టు అనిపించిందని చెప్పాడు. అలాగే స్క్రిప్ట్ రెడీ చేసి రమ్మని చిరు అన్నయ్య చెప్పగా అదంతా రెడీ చేసుకుని ఈ సినిమాని పట్టాలెక్కించామని... చాలాకష్టపడి, ఇష్టపడి ఈ 'ఖైదీ నెంబర్ 150' ని తెరకెక్కించామని చెప్పాడు. ఇక 'ఖైదీ నెంబర్ 150' రిజల్ట్ సంక్రాతి కానుకగా ఈ నెల 11 న తెలుస్తుందని చెప్పుకొచ్చాడు.