కొన్ని వర్గాల, మతాల మనోభావాలను దెబ్బతినేలా చూసి, తమ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ పొందాలని నేటి తరం దర్శకులు, నిర్మాతలు ఆరాటపడుతున్నారు. ఇప్పుడు అదే కోవలో ఓ చిత్రం టీజర్ తీవ్ర విమర్శలకు కేంద్రబిందువైంది. నిర్మాత హరి, సాయిరాం దాసరి దర్శకత్వంలో 'ద్యావుడా' చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై పలు వివాదాలను రేపుతోంది. ఈ టీజర్‌లో శ్రీవేంకటేశ్వరస్వామి చిత్ర పటాన్ని నేలకేసి కొట్టడం, పవిత్రమైన శివలింగంపై బీరుతో అభిషేకం చేసి, సిగరెట్లతో దూపం వెలిగించడం వంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. దీంతో పలువురు దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ టీజర్ ఉందని భజరంగ్‌దళ్ నేతలు దర్శకనిర్మాతలపై కోపంగా ఉన్నారు. ఈ టీజర్‌ను యూట్యూబ్ నుండి తొలగించకపోతే భౌతిక దాడులకు కూడా దిగుతామని హెచ్చరిస్తున్నారు. దర్శకనిర్మాతలను వెంటనే ఆరెస్ట్ చేయాలని హైదరాబాద్‌లో పోలీస్ కేసు కూడా పెట్టారు. అదే మైనార్టీలైన ముస్లిం, క్రిస్టియన్ల దేవుళ్లను ఇలా చూపించే ధైర్యం మీకుందా? హిందువులంటే మీకు లోకువా? అంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికే దీని ద్వారా ఫ్రీపబ్లిసిటీ పొందిన దర్శకనిర్మాతలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి...! కాగా ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది.