తమ వారసులు ఎలా ఉన్నా సరే సర్జరీలు చేయించి, తర్ఫీదులు, చిట్కాలు ఇస్తూ, తమకు సినిమా ఫీల్డ్‌లో ఉన్న పలుకుబడితో టాలెంటెడ్ దర్శకులను పెట్టుకొని, నిర్మాతలను వెతికిపట్టుకొని, వారికి వెనక ఉండి ఆయా నిర్మాతలకు తామే పెట్టుబడి పెడుతూ, లేదా తామే వరుస చిత్రాలు తీస్తూ ప్రేక్షకులకు ఆయా ఫేస్‌లు అలవాటయ్యేలా బలవంతంగా ఆడియన్స్ తలపై రుద్దే వారు ఎందరో ఉన్నారు. దీనికి ఏ ఫ్యామిలీ కూడా మినహాయింపు కాదు. ఇక మాస్టర్ బ్రెయిన్ కలిగిన అల్లు అరవింద్ వంటి నిర్మాత తన పెద్ద కుమారుడైన అల్లు అర్జున్‌ను మొదటి చిత్రం 'గంగోత్రి'లో చూసి వీడేంట్రా హీరో అనుకుని నవ్వుకున్న వారిచేతనే సెహభాష్ అనిపించేలా చేసి, టాలీవుడ్‌లో స్టార్‌ని చేశాడు. ఇక తన కుమారుడికి ఇతర భాషల్లోని ప్రముఖ నిర్మాతలు, దర్శకుల సహకారంతో మిగిలిన భాషల్లో కూడా మార్కెట్‌పెంచడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
కాగా ఆయన తన చిన్న కుమారుడు, బన్నీ సోదరుడైన అల్లు శిరీష్‌ను ప్రకాష్‌రాజ్ చేతిలో పెట్టి 'గౌరవం' ద్వారా హీరోగా పరిచయం చేశాడు. తర్వాత మంచి ఊపులో ఉండి కొత్త వారిని కూడా బాగా చూపిస్తాడనే పేరున్న మారుతిని దర్శకునిగా పెట్టుకొని తానే 'కొత్త జంట' చిత్రం నిర్మించాడు. కానీ ఈ రెండు చిత్రాలలో శిరీష్ నటన, లుక్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా పరుశురాం అనే టాలెంటెడ్ దర్శకునితో ఈ మధ్య 'శ్రీరస్తు.. శుభమస్తు' చిత్రం తీశాడు. ఈ చిత్రంలో శిరీష్ నటనాపరంగా, లుక్‌పరంగా ఫర్వాలేదనిపించాడు. అరవింద్‌కు తనకున్న పరిచయంతో తాజాగా మోహన్‌లాల్ వంటి మలయాళంలో సూపర్ స్టార్‌గా అద్భుతమైన ఇమేజ్ ఉన్న హీరో చిత్రంలో శిరీష్‌కు కూడా తానే ఓ పాత్ర ఇప్పించి ప్రస్తుతం మలయాళానికి పరిచయం చేస్తున్నాడు. 'శ్రీరస్తు.. శుభమస్తు' చిత్రం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ఈ మెగా ప్రొడ్యూసర్ ఈ చిత్రానికి చేసిన పబ్లిసిటీ, మంచి థియేటర్ల ఎంపిక, సరైన రిలీజ్‌టైం... వంటి వాటితో పాటు సినిమా ఫర్వాలేదనే టాక్ రావడంతో శాటిలైట్‌తో కలిపి ఈ చిత్రం 15 కోట్లు వసూలు చేసిందని లెక్కలు చూపించాడు. ప్రస్తుతం ఓ కొత్త నిర్మాత అల్లు శిరీష్‌తో చిత్రం చేయాలని ఉబలాటపడుతున్నాడట. కొత్తగా మోహన్‌లాల్ చిత్రంతో తనకు మలయాళంలో కూడా మంచి మార్కెట్ వస్తుందనే విషయాన్ని చెప్పి, రెమ్యూనరేషన్‌గా ఆ నిర్మాతను ఏకంగా కోటిరూపాయలు శిరీష్ డిమాండ్ చేశాడని సమాచారం. మరి ఇది పబ్లిసిటీ జిమిక్కా? లేక నిజంగానే కోటి డిమాండ్ చేశాడా? అనేది ప్రస్తుతం హాట్‌టాపిక్ అయింది.