చిన్న చిత్రంగా విడుదలై, విడుదలకు ముందు పెద్దగా అంచనాలులేని చిత్రం 'అప్పట్లో ఒకడుండేవాడు'. 'అయ్యారే..' చిత్రంతో టాలెంట్ ఉన్న దర్శకునిగా నిరూపించుకున్న సాగర్. కె.చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రంలో ఓ హీరోగా నటించిన నారారోహిత్ దీనిని కూడా నిర్మించడం జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్30న విదుడలైన ఈ చిత్రం సంచనాలు సృష్టిస్తోంది. సినిమా విడుదలకు ముందే అదే రోజున విడుదలయిన అల్లరినరేష్-జి.నాగేశ్వర్‌రెడ్డి వంటి క్రేజీ అండ్ సక్సెస్‌ఫుల్ కామెడీ జోడీ చేసిన చిత్రం కావడం, దీనికి భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించి, భారీ ఎత్తున ప్రమోషన్ చేయడంతో 'అప్పట్లో ఒకడుండేవాడు' కంటే 'ఇంట్లో దెయ్యం...' చిత్రానికే ఎక్కువ ఓపెనింగ్స్‌తోపాటు మంచి థియేటర్లు లభించాయి.
కానీ పెద్దగా పబ్లిసిటీ లేకుండా కేవలం మౌత్‌టాక్‌తోనే 'అప్పట్లో ఒకడున్నాడు' చిత్రం అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. 1990లలో పాతబస్తీలో జరిగిన నిజజీవిత సంఘటనల ఆధారంతో రూపొందడం, స్టాంప్‌ల కుంభకోణం, నక్సలిజం, రియల్ ఎస్టేట్ వంటి సున్నిత అంశాలను అద్భుతంగా, సున్నిత భావోద్వేగాల మధ్య చూపించడం, బిగువైన స్క్రీన్‌ప్లేతో పాటు విభిన్న కథాంశం కావడం, మంచి ఎమోషన్స్ ఉండటంతో ఈ చిత్రానికి అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. కేవలం ఫొటోగ్రఫీ వంటి అంశాలలో మాత్రమే ఈ చిత్రం వెనుకబడిందని, లోబడ్జెట్‌తో నిర్మించేటప్పుడు ఇలాంటివి కామన్ అని, అదే మంచి టెక్నీషియన్స్‌ను, బడ్జెట్‌ను, పబ్లిసిటీని పెంచి ఉంటే ఎక్కడికో వెళ్లిపోయేదని ట్రేడ్‌పండితులతో పాటు పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఒకేసారి సామాన్యప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తుండటం, ప్రతి సెంటర్‌లోనూ హౌస్‌ఫుల్ కలెక్షన్లు సాధిస్తుండటంతో ఈ చిత్రం 20కోట్ల మార్క్‌ను చేరడం ఖాయమంటున్నారు. శాటిలైట్ హక్కులే రెండు కోట్లపై పైగా పలుకుతున్నాయట. ఇక ఇంతకాలం విభిన్న చిత్రాలు చేస్తూనే ఉన్నా, సరైన కమర్షియల్ బ్రేక్‌లేని నారారోహిత్‌తో పాటు మరో హీరోగా నటించిన శ్రీవిష్ణుకు కూడా అద్భుతమైన ఆఫర్స్ వస్తున్నాయి. వీరిద్దరు మరింత బిజీగా మారిపోనున్నారు. ముఖ్యంగా శ్రీవిష్ణు నటన చూస్తే హీరో నానిలా ఎదుగుతాడనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఇంతకాలం వారు పడ్డ కష్టానికి సరైన ఫలితం లభించిందనే చెప్పాలి.
ఇక ఈ చిత్రం విషయంలో నిర్మాతగా, హీరోగా నారారోహిత్ టేస్ట్‌ను, గట్స్‌ను ఎంత ఎక్కువగా మెచ్చుకున్నా తక్కువే అని చెప్పాలి. కొన్ని కొన్ని సెంటర్స్‌లో ఈ చిత్రం అమీర్ నటించిన కళాఖండం 'దంగల్' చూడాలనుకున్న వారిని కూడా తన వైపుకు లాక్కుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కాగా ఇప్పుడు ఈ చిత్రం థియేటర్ల సంఖ్యపెంచుతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే ఈ చిత్రం అదనంగా ఏడు థియేటర్లను పెంచుకుంటోంది. త్వరలో సంక్రాంతి పోరులో బాలయ్య, చిరు, దిల్‌రాజులు అన్ని థియేటర్లను కబ్జా చేయనున్న నేపథ్యంలో ఈ చిత్రం మనుగడ అవి విడుదలైతే కష్టమే. అందుకే ఆలోపు థియేటర్లను పెంచి వీలైనంతగా కలెక్షన్లు రాబట్టే నిర్ణయం చాలా బాగా ఈ చిత్రానికి ఉపయోగపడుతుందని అంటున్నారు.