ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకూ విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెదేపా ఆ తర్వాత ఒక్కొక్కరిగా వైకాపా ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీలో విలీనం చేసుకున్న విషయం తెలిసిందే. అధికార పార్టీలోకి అలా పలు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కూడా కలుపుకొని పోవడం ఎక్కడైనా, ఎప్పుడైనా అది సహజమైన పరిణామమే. అయితే... ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చూస్తే రాయల సీమలో మాత్రం జగన్ కు ఏమాత్రం పట్టు తగ్గలేదనే చెప్పాలి. గత ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల్లో జగన్ పార్టీ అత్యధిక సీట్లు సాధించిన విషయం తెలిసిందే. తెదేపాకు అతి కష్టం మీద అక్కడ కొన్ని సీట్లు మాత్రమే సాధించేందుకు సాధ్యపడిందని చెప్పాలి.
అసలు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు సామాజిక వర్గాల ప్రాతిపదిక మీదనే నడుస్తున్నాయి. ఎక్కడ ఏ వర్గం వారు ఎక్కువమంది ఉంటే అక్కడ ఆ వర్గం వారికి విజయాన్ని వరించడం జరుగుతుంది. అందుకు అనుగుణంగానే ఆయా పార్టీలు ఆయా వర్గాల వారికే అక్కడ అధిక సీట్లు ఇచ్చి పోటీ పెట్టడం జరుగుతుంది. అందుకనే గత ఎన్నికల్లో చంద్రబాబు చాలా తెలివిగా వ్యవహరించి అనంతపురంలో జెసీ బ్రదర్స్ ను తమ పార్టీలోకి ఆహ్వానించి ఆ జిల్లాలోనే ఎక్కువ సీట్లు సాధించుకొనేందుకు పథక రచన చేశాడు. ఆ తర్వాత బాబు అధికారాన్ని చేపట్టాక రాయలసీమలో పట్టుసాధించేందుకు వీలున్నంతవరకు తనకు సాధ్యమైనంతవరకు పలు రకాల దండోపాయాలను ప్రవేశపెట్టో లేకా మరో ఉపాయాలను పన్నో రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెట్టి తర్వాత జరగబోయే ఎన్నికలకు కూడా పక్కా వ్యూహ రచన చేసుకున్నాడనే చెప్పాలి.
కాగా చంద్రబాబు ప్రస్తుతం నాయకులపై కాకుండా ప్రాంతం, ప్రజోపయోగమైన అంశాలపై దృష్టిపెట్టినట్లుగా తెలుస్తుంది. ఎప్పటినుండో రాయలసీమలో కరువు విలయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ప్రతి నాయకుడు అది చేస్తాం, ఇది చేస్తామని ఊరించారే తప్ప ఏనాడూ కూడా ప్రజోపయోగానికి సంబంధించిన పనులు చేసిన పాపాన పోలేదు. తాజాగా చంద్రబాబు కరువును రూపు మాపే ఆలోచనపై ప్రత్యేక దృష్టిపెట్టి దానికనుగుణంగా చక్రం తిప్పుతున్నాడనే చెప్పాలి. ఒక్క దెబ్బతో రెండు పిట్టలు అన్నట్లుగా చంద్రబాబు అటు సామాజిక ప్రాతిపదిక పార్టీని పటిష్టపరుస్తూ... అదే సమయంలో రాయల సీమకు నీళ్లు అందేలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలా రాబోవు ఎన్నికల నాటికి జగన్ ను రెండు విధాలుగా దెబ్బకొట్టాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే.. ఈ మధ్య కర్నూలు జిల్లాకు సంబంధించి ముచ్చుమర్రిలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాడు. ఆ తర్వాత పైడి పాళానికి చెందిన పంపింగ్ పథకాన్ని కూడా త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమౌతున్నట్లుగా సమాచారం అందుతుంది. దీంతో కృష్ణ కాలువ ద్వారా ఆ జలాలను పైడిపాలప్రాజెక్టుకు తెచ్చి పులివెందులలో ప్రజలకు నీళ్లందించేలా చేయాలన్నిదే బాబు సంకల్పంగా తెలుస్తుంది. ఇదే గానీ బాబు సఫలం చేస్తే పులివెందులలో జగన్ ను భారీస్థాయిలో దెబ్బకొట్టినట్లుగానే అనుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో.