నేటి రోజుల్లో సినిమాల నిడివి సాధ్యమైనంత తక్కువగా ఉండేలా దర్శకనిర్మాతలు, హీరోలు ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నారు. నిడివి పెరిగి బోర్ కొట్టించే సీన్లు ఉంటే రిలీజ్ అయిన వెంటనే ప్రేక్షకుల స్పందనకు అనుగుణంగా ట్రిమ్ చేస్తున్నారు. కానీ మీడియా విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో మొదటి షోకే సినిమా టాక్ సామాన్యులకు కూడా చేరిపోతోంది. దీంతో ట్రిమ్ చేసిన ఫలితం రాని పెద్ద చిత్రాలు ఉదాహరణగా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇక ఈనెల 12న రిలీజ్ కానున్న బాలయ్య 100వ చిత్రం, హిస్టారికల్ మూవీ అయిన 'గౌతమీపుత్ర శాతకర్ణి'.. చాలా తక్కువ నిడివితో తీశారనే వార్తలు వచ్చాయి. అంత మహావీరుని చరిత్రను అతి తక్కువ నిడివిలో చూపించిన క్రిష్, బాలయ్యలపై కొందరు ఇప్పటికే ప్రశంసల వర్షం కురిపించారు. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా ఈ చిత్రాన్ని ఎంతో షార్ప్‌గా, క్రిస్ప్‌గా తీయడంపై ఆనందం వ్యక్తమవుతోంది. ఈ చిత్రం రేపు (గురువారం) సెన్సార్‌కు వెళ్లనుంది. అప్పుడు పూర్తి వివరాలు తెలియనున్నాయి.
కాగా చిరు నటించిన 150వ చిత్రమైన 'ఖైదీ....' చిత్రం నిడివి మాత్రం దాదాపు రెండున్నర గంటలు ఉందట. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని ఏమైనా ట్రిమ్ చేయవచ్చా? అనే అంశంపై నిర్మాత చరణ్, డైరెక్టర్ వినాయక్‌లు దృష్టి పెట్టగా, చిరు మాత్రం ఉన్నది ఉన్నట్లుగా రిలీజ్ చేయమని గట్టిగా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. నేటి రోజుల్లో రెండున్నర గంటలంటే ఎక్కువ నిడివే అని తెలుస్తోంది. మరోపక్క ఈ చిత్రం ట్రైలర్‌తో దీనిపై ఓవర్‌సీస్‌లో కూడా భారీ అంచనాలు పెంచాలని చిరు భావిస్తున్నాడట. కాగా ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ కటింగ్ అయిపోయింది. కానీ చిరు మాత్రం ఈ ట్రైలర్ చూసి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. దీంతో ప్రస్తుతం ఆ మార్పులు, చేర్పుల్లో యూనిట్ మొత్తం బిజీగా ఉంది. ఈ ట్రైలర్‌ను ప్రీరిలీజ్ ఫంక్షన్ సందర్భంగా 7వ తేదీన అదే వేడుకలో రిలీజ్ చేయనున్నారు.