తంగవేలు మరియప్పన్ ఇటీవల వార్తల్లో నిలిచాడు. దివ్యాంగుడైన ఈయన రియోలో జరిగిన పారా ఒలింపిక్స్‌లో హైజంప్‌లో బంగారు పతకం తెచ్చి, ఇండియాకు హైజంప్ విభాగంలో తొలి స్వర్ణపతకం తెచ్చిన హీరోగా నిలిచాడు. కాగా చిన్ననాడే బస్సు యాక్సిడెంట్‌లో కాలు కోల్పోయిన ఈయన జీవిత గాథను రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తన స్వీయనిర్మాణ, దర్శకత్వంలో బయోపిక్‌గా తెరకెక్కిస్తోంది. తమిళనాడుకు చెందిన తంగవేలు మన జాతీయ హీరో అని షారుఖ్ ప్రకటించి, ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశాడు. ఈ చిత్రం తమిళంతోపాటు ఇంగ్లీషు భాషల్లో రూపొందుతోంది. కోలీవుడ్‌లో ఓ క్రీడాకారుడి బయోపిక్‌తో వస్తున్న తొలిచిత్రంగా ఇది రికార్డులకు ఎక్కనుంది. కాగా తన జీవితగాథపై ఓ చిత్రం వస్తుందని తాను అసలు ఊహించలేదని, ఇది తన జీవితంలో మరపురాని సంఘటనగా గుర్తుండిపోతుందని తంగవేలు ఉద్వేగంగా చెబుతున్నాడు. మరి 'సుల్తాన్, దంగల్' వంటి బయోపిక్స్ సంచలనం సృష్టించిన తరుణంలో ఈ క్రీడాకారుడి బయోపిక్‌ను ఐశ్యర్య ఎలా తెరకెక్కించనుంది? అనే అంశం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది.