మొదటి నుండి కూడా చిరంజీవికి సంబంధించిన సర్వ విషయాలు అల్లు అరవిందే చూసుకుంటున్న విషయం తెలిసిందే. అందుకనే చిరంజీవి నటజీవితానికి మైలురాయిగా పేర్కొనే 150వ సినిమాను తన బ్యానర్ లో తీయాలని తపించాడు అల్లు అరవింద్. అయితే ఈ యువకులు వృద్ధిలోకి వచ్చాక ఆ పెద్ద మనిషివి అనుకున్నవి అనుకున్నట్లుగా జరగడం లేదు. అదేంటంటే... చిరంజీవి 150వ చిత్రాన్ని తన సొంత బ్యానర్ లో తీద్దామనుకున్న అల్లు అరవింద్ కు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఝలక్ ఇచ్చి చాలా చాకచక్యంగా వ్యవహరించి తన సొంత బ్యానర్ లోనే తీసేశాడు. అయితే అరవింద్ ఏదోలా చిరంజీవి 150 సినిమా మిస్ కావడంతో కనీసం 151 చిత్రమైనా దక్కించుకుందామని భావించాడు. అందుకు అనుగణంగా గతంలో కూడా చిరంజీవితో తాను 151వ చిత్రాన్ని చేస్తానని మీడియా సమక్షంలో ప్రకటించేశాడు కూడాను. ఆ చిత్రానికి దర్శకుడుగా కూడా సురేందర్ రెడ్డిని అప్పుడే మాట్లాడేసి పెట్టుకున్నాడు అరవింద్. దాంతో చిరంజీవి 151వ చిత్రాన్ని అరవింద్ చేతుల్లోకి వెళ్లినట్లేనని అందరూ భావించారు కూడాను. కానీ తాజాగా చరణ్ ఇచ్చిన ట్విస్ట్ కి మామకు దిమ్మ తిరిగినట్లేనని చెప్పాలి.
తాజాగా రామ్ చరణ్ ఓ వీడియో బైట్ ద్వారా చిరంజీవి 151వ చిత్రాన్ని తన సొంత బ్యానర్ పై కొణిదెల కంపెనీలోనే చేస్తానని వెల్లడించాడు. అంతే కాకుండా నాన్నగారి తర్వాతి చిత్రమైన 151వ సినిమాకి కూడా తానే నిర్మాతగా వ్యవహరిస్తానని కూడా ప్రకటించేశాడు. ఈ విషయాలపై త్వరలో స్పష్టతతో కూడిన ఓ ప్రకటన కూడా విడుదల చేస్తానని చరణ్ ప్రకటించేశాడు. దీంతో మామకి అల్లుడు గట్టి షాక్ ఇచ్చినట్లు అయింది. అంతే కాకుండా ఖైదీ నెం.150 చిత్రం భారీగా బిజినెస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం బాక్సీఫీసు వద్ద ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేం గానీ ముందుగానే భారీస్థాయిలో టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో నిర్మాతగా రుచిమరిగిన చరణ్ కు అందులోనే అదీ నాన్నతోనే మరో సినిమా చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.