చిరంజీవి 150 వ మూవీ 'ఖైదీ నెంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి దాసరి నారాయణరావు ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నాడట. షాక్ అవుతున్నారా..!. అవును మీరు వింటున్నది నిజమే. అదేమిటి దాసరి సినిమా ఫంక్షన్స్ కి గట్రా చాలా వాటికే హాజరవుతాడుగా ఇందులో షాక్ అవ్వాల్సిన విషయం ఏముంటుందని అనుకుంటున్నారా.... అక్కడికే వస్తున్నాం. దాసరికి, మెగా హీరోలకి పెద్దగా పడదు. దాసరి అవకాశం వచ్చినప్పుడల్లా మెగా హీరోలకు చురకలంటిస్తూ ఉంటాడు. ఇక వాటికి మెగా హీరోలు కూడా ఎదురు దాడి చేసిన సందర్భాలు వున్నాయి. అయినా ఎప్పటికప్పుడు దాసరి.. మెగాస్టార్ చిరంజీవిని ఎదో ఒక సూటి పోటీ మాటలతో ఎత్తిపొడుస్తూ ఉంటాడు.
అలాంటి దాసరి నారాయణ రావు ఈ మధ్యన రాజకీయాల దృష్ట్యా చిరుతో కలిసి ముద్రగడకు సంఘీభావం తెలపడం దగ్గరనుండి..... దాసరి ఇంటికి చిరు రావడం అంతా కలిసి ప్రెస్ మీట్స్ పెట్టడం వంటివి..వీరి మధ్య సత్సంబంధాలనే కొనసాగిస్తున్నారని అంతా అనుకున్నారు. మరి అందుకే చిరంజీవి 'ఖైదీ....' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రామ్ చరణ్ దాసరిని ఆహ్వానించాడని... ఇక దాసరి కూడా ఈ ఫంక్షన్ కి రావడానికి అంగీకారం తెలిపాడని అంటున్నారు. మరో వైపు మెగాభిమానులు మాత్రం ఈ హఠాత్పరిణామానికి షాకై పోతున్నారు. ఎందుకంటే మెగా హీరోలను విమర్శించే దాసరి అంటే వాళ్లకి అస్సలు పడదు. అందుకని ఆయన రావడం వారికీ బొత్తిగా ఇష్టం లేనట్లుంది.
ఇక ఈ 'ఖైదీ నెంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి చాలామంది పెద్దలే హాజరవుతున్నట్లు చెబుతున్నారు. కె. రాఘవేంద్ర రావు దగ్గరనుండి సూపర్ స్టార్ మహేష్ వరకు ఈ ఫంక్షన్ కి వచ్చే అతిధుల జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం విజయవాడ - గుంటూరు మధ్యలో వున్న హాయ్ ల్యాండ్ లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫంక్షన్ ని ఈనెల 7 న జరగనున్నట్లు 'ఖైదీ...' యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.