మెగాస్టార్ చిరు 'ఖైదీ నెంబర్ 150' చిత్రం పబ్లిసిటీ కార్యక్రమాల్లో నిర్మాత రామ్ చరణ్, చిత్ర యూనిట్ బిజీగా వుంది. ఇక ఈ 'ఖైదీ..' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని జనవరి 4 న విజయవాడలో జరపతలపెట్టగా ఏపీ ప్రభుత్వం ఆ ఫంక్షన్ కి అనుమతి ఇవ్వలేదు. ఇక చేసేది లేక 'ఖైదీ....' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గుంటూరు - విజయవాడ మధ్యన వున్న హయ్ ల్యాండ్ లో ఈ నెల 7న జరుగుతుందని అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే విజయవాడలో ఈ ఫంక్షన్ జరగకుండా ఏపీ ప్రభుత్వం కావాలనే అడ్డుకుందని కేవలం చిరు ఫంక్షన్ కాబట్టే టిడిపి ప్రభుత్వం అలా శాంతి భద్రతలు వగైరా వంకలు చెప్పి అనుమతివ్వకుండా తిప్పలు పెట్టిందని మెగా అభిమానులు కోపం తో ఊగిపోతున్నారు.
ఇక అధికార పార్టీ ఎమ్యెల్యే అయిన బాలకృష్ణ కి అడగ్గానే తిరుపతిలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' కి అనుమతినిచ్చిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు చిరంజీవి విషయంలో భేషజం పోతుందని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే హాయ్ ల్యాండ్ లో జరిగే 'ఖైదీ..' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాట్లను చరణ్ మామ అల్లు అరవింద్ పర్యవేక్షిస్తున్నారు. అన్ని దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అరవింద్ ని 'ఖైదీ...' ఫంక్షన్ కి మెగా ఫ్యామిలీ అటెండ్ అవుతుందా.. అని అడగగా.. అందరూ తప్పక వస్తారని చెప్పిన అరవింద్ పవన్ మాత్రం రాడని చెప్పాడు.
మరి మెగాస్టార్ 9 ఏళ్ళ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న 'ఖైదీ....' ఫంక్షన్ కి పవన్ రాకపోవడమేమిటి అని ఆలోచించే లోపే అరవింద్ అపర చాణుక్యం తో పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ వల్ల ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హాజరు కాలేక పోతున్నాడని క్లారిటీ ఇచ్చాడు . ఇక 'ఖైదీ నెంబర్ 150' ఫంక్షన్ కి సూపర్ స్టార్ మహేష్ వంటి టాప్ స్టార్స్ కూడా హాజరవుతారనే ప్రచారం జరుగుతుంది. అయితే 'ఖైదీ...' చిత్రం ఈ నెల 11 న విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.