'బిచ్చగాడు' చిత్రంతో హీరో విజయ్ ఆంటోనికి టాలీవుడ్‌లో కూడా క్రేజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన 'బేతాళుడు' చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించనప్పటికీ 'బిచ్చగాడు' క్రేజ్‌తో మంచి ఓపెనింగ్స్‌నే రాబట్టింది. త్వరలో ఆయన ఓ స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం వివరాలు తెలియాల్సివుంది. తాజాగా ఆంటోని హీరోగా నటిస్తున్న 'యెమన్' తమిళ చిత్రాన్ని తెలుగులో 'యముడు' అనే టైటిల్‌తో విడుదల చేయాలని భావిస్తున్నారట. కానీ ఇప్పటికే సూర్య నటించిన 'యముడు' చిత్రం తెలుగులో సూపర్‌హిట్ అయిన నేపథ్యంలో ఈ టైటిల్ పెట్టడంపై యూనిట్ పునరాలోచనలో పడిందని సమాచారం. దీంతో 'యముడు' టైటిల్‌ను మార్చి మరో నెగటివ్ టైటిల్‌ను వెతకడమో, లేక 'యముడు' టైటిల్‌కు ముందు లేదా వెనుక ఏదో ఒక పదం చేర్చడమో చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు 'నకిలి'కి ఒరిజినల్ తమిళ వెర్షన్ 'నాన్'కు దర్శకత్వం వహించి, విజయ్‌ఆంటోనికి కోలీవుడ్‌లో అద్భుతమైన ఆరంభాన్ని అందించిన దర్శకుడు జీవా శంకర్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కాగా భారీ బడ్జెట్ చిత్రాలను, ప్రస్తుతం శంకర్,రజనీ, అక్షయ్‌ల కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో '2.0' చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ దీనిని కూడా నిర్మిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. త్వరలో తెలుగు టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి, ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.