ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు సినిమాలు చేసి చాలా కాలం అయింది. అప్పట్లో పవన్ తో సినిమా అని ప్రచారం జరిగింది గానీ, ఆ తర్వాత అది ప్రచారానికి మాత్రమే సరిపెట్టుకుంది. ఎర్రబస్సు సినిమా తర్వాత దాసరి దర్శకత్వంలో సినిమానే లేదు. ఎర్రబస్సుకు ముందు ఆరోగ్యం సరిగా లేక, అవినీతి మచ్చ వచ్చి మీద పడటం వంటి కారణాల వల్ల దాసరి సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్నారనే చెప్పాలి. ఎర్రబస్సు తర్వాత కూడా ఆయన చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. కొంతకాలం క్రితం పవన్ తో సినిమా అని ప్రచారం, ఆ తర్వాత పితృదేవో భవ అన్న పేరుతో సినిమా చేయబోతున్నారని ఓ సారి మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అది ఏమైపోయిందనేది కూడా ఆ తర్వాత దాని ఊసులేదు. ఇంకా దాసరి అప్పుడెప్పుడో అసెంబ్లీ నడిచే విధానం, ప్రజాస్వామ్యం వంటి అంశాలతో సినిమా చేస్తానని ప్రకటించాడుగానీ ఆ తర్వాత దాని ఊసుకూడా లేదు. ఈ అంశంపై సినిమా తీసేందుకు దాసరి వడ్డీకాసులవాడు అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించారు.
అయితే దర్శకుడు దాసరి తాజాగా ‘అమ్మ’ పేరుతో ఓ సినిమా టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ఇక అమ్మ అనగానే సహజంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరు గుర్తుకు వస్తుంది. చాలా కాలం పాటు అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతూ.. గత నెలలో తుది శ్వాస విడిచిన జయలలిత జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని దాసరి సినిమాను తెరకెక్కించేందుకు ఈ మధ్య కసరత్తులు చేస్తున్నారు. అమ్మ మరణం ఓ రహస్యంగా పరిగణించి అది ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఆమె మరణం చుట్టూతా జరిగిన తంతును దాసరి సినిమాగా తీస్తారేమోనన్న అనుమానాలు పరిశ్రమ వర్గాల్లో మొదలయ్యాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కించబోయే ఈ సినిమాకి దాసరి నారాయణ రావు దర్శకుడుగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా దాదాపు అయిపోవడంతో త్వరలోనే ఆ సినిమాకు సంబంధించి ఓ ప్రకటణ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ మధ్యనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా శశికళ పేరుతో ఓ టైటిల్‌ని రిజిస్టర్ చేయించిన విషయం తెలిసిందే. అయితే ఆసక్తికరమైన టైటిళ్ళను ఎంచుకోవడంలోనూ, వాటిని వెంటనే రిజిస్టర్ చేయించుకోవడంలోనూ దాసరి, వర్మ ఇద్దరూ పోటాపోటీగా ఉంటారనుకోండి. చూద్దాం.. వీరిలో ఎవరి సినిమా ముందు స్టార్ట్ అవుతుందో.. అసలు అవుతుందో అవదో అనే విషయంపై పూర్తిగా క్లారిటీ రావాలంటే ఆయా ప్రకటణలు వచ్చేంతవరకు ఆగాల్సిందే.