తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మంచి గుర్తింపును పొందిన హీరోయిన్ సంజన. కాగా ఈమె ఇటీవల కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె దృష్టిలో సమస్యల పరిష్కారం కన్నా వాటి నివారణే ముఖ్యమని ఆమె ఉద్దేశ్యంగా ఉంది కాబోలు. అందుకే ఎవ్వరికీ తట్టని ఐడియాను వెలిబుచ్చింది. ఈ దేశంలో వాహనాలు నడపడానికి లైసెన్స్ కావాలి. వస్తువుల ఉత్పత్తికి, అమ్మకాలకు లైసెన్స్ కావాలి. అలాగే పిల్లల్ని కనే ముందు తల్లులకు కూడా వారిని పెంచే స్థోమత ఉందా? లేదా? అనేది విచారించి, వారికి లైసెన్స్‌లు ఇవ్వాలని వ్యాఖ్యానించింది. ఇదే విషయాన్ని ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు కూడా ఆయనకు వివరించానని గొప్పలు చెప్పుకుంటోంది. కొందరు తల్లులు.. పిల్లల్ని కని, పెంచే స్థోమత లేక బాలకార్మికులుగా మారుస్తున్నారు. మరికొందరు పసిపిల్లలను భుజాన వేసుకొని బిచ్చమెత్తుతున్నారు. ఇంకొందరు బిడ్డలను అద్దెకు తీసుకొని, బిడ్డల చేత యాచన చేయిస్తున్నారు. వీరికి లక్షలు ఇచ్చినా అదే పని చేస్తారు. కాబట్టి పిల్లలను కని, పెంచే వారికి మాత్రమే తల్లులయ్యేందుకు లైసెన్స్‌లు ఇవ్వాలని వ్యాఖ్యానించింది. అంటే ఆమె దృష్టిలో డబ్బున్న వారు మాత్రమే పిల్లల్ని కనాలని ఉద్దేశ్యం కాబోలు అంటూ కొందరు విరుచుకుపడుతున్నారు. లక్ష ఇచ్చినా వారు మారరు అనే స్టేట్‌మెంట్ ఇచ్చింది. మరి ఆమె ఎంత మందికి లక్షలు ఇచ్చిందో ఆమెకే తెలియాలి. పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సరిగ్గా పేదలకు అందాలని అనకుండా, ఏకంగా పిల్లలు కనడానికి లైసెన్స్‌లు ఇవ్వాలని చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.