జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కోసం తమ పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రాకు ప్రత్యేక హోదా కోసం ముచ్చటగా మూడు బహిరంగ సభలు కూడా నిర్వహించిన విషయం కూడా విదితమే. కాగా తాజాగా అందిన సమాచారం ప్రకారం రేపు(మంగళవారం) జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ స్వయంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో రోడ్ షో నిర్వహించనున్నాడు. అయితే ఈ రోడ్ షోకు సంబంధించి జనసేన కార్యకర్తలతో పాటు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఈ రోజు(సోమవారం) సాయంత్రానికే విశాఖపట్టణం చేరుకోనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. రేపు వైజాగ్ నుండి ఇచ్చాపురం చేరుకోనున్నారు. కాగా పవన్ కళ్యాణ్ ఇచ్చాపురం పర్యటనలో భాగంగా ఉద్దానం గ్రామంలోని మణికంఠ థియేటర్ వద్ద ఉన్న కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న వారిని పరామర్శిస్తారు. కిడ్నీ వ్యాధి బారిన పడి మరణించిన వారి గురించి ఉద్దేశించి ఈరోజు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ.. రెండు దశాబ్దాలలో దాదాపు కిడ్నీ వ్యాధికి గురై దాదాపుగా 20000 మంది వరకు మరణించారని, ఇంత జరుగుతున్నాఆ ప్రాంతంలోని నేతలెవరూ వారిని పట్టించుకోకపోవడం చాలా దారుణమని, ఆ విషయం తమ దృష్టికి రావడంతో తాను ఆ దిశగా పయనం మొదలుపెట్టాల్సి వస్తుందని పవన్ తెలిపాడు. ఇప్పటికే ఆయన పరామర్శించే రోగుల జాబితాను జనసేన కార్యకర్తలు సిద్ధం చేశారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారిని పరామర్శించిన తర్వాత పవన్ ఆయా రోడ్ షోలో పాల్గొంటారని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ రోడ్ షోలు ఆయన రాజకీయ జీవితానికి అంకురార్పనగా పలువురు ప్రముఖులు విశ్లేషిస్తున్నారు.