దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి ది బిగినింగ్' చిత్రం కనివినీ ఎరుగని కలెక్షన్లు సొంతం చేసుకొని, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం విజువల్ వండర్‌గా రూపొందడం, అద్భుతమైన సెట్టింగ్స్ వంటి వాటితో హైటెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన సంగతి తెలిసిందే. దీన్ని చూసి బాలీవుడ్ సినీ వర్గాలే కాదు... కోలీవుడ్ సినీ వర్గాలు కూడా కుళ్లుకుంటున్నాయి. తాము అలాంటి చిత్రం ఎందుకు తీయలేమనే పట్టుదలతో కుతకుతతాడిపోతున్నారు పలువురు. కాగా 'బాహుబలి1' రిలీజై సంచలనం సృష్టించిన తర్వాత మరో దర్శకదిగ్గజం శంకర్ 'ఐ' చిత్రం తీశాడు.
ఇక తమిళంలో విజయ్ హీరోగా శ్రీదేవిని పెట్టుకొని మరీ 'పులి' కూడా తీశారు. 'ఐ' యావరేజ్ దగ్గరే ఆగిపోగా, 'పులి' డిజాస్టర్‌గా నిలిచింది. ఇక బాలీవుడ్‌లో కూడా గత ఏడాది విడుదలైన 'బాజీరావ్‌మస్తానీ'తో 'బాహుబలి'ని బీట్ చేయాలని భావించారు. కథ విషయంలో 'బాహుబలి' కంటే 'బాజీరావ్‌మస్తానీ' చిత్రం బాగున్నప్పటికీ, ఆ చిత్రం సాధించిన కలెక్షన్లను మాత్రం అందుకోలేకపోయింది. ఇటీవల హృతిక్‌రోషన్. పూజాహెడ్గేల కాంబినేషన్‌లో రూపొందిన 'మొహంజదారో' చిత్రం 'బాహుబలి' రికార్డులను కొల్లగొడుతుందని బాలీవుడ్ మీడియా తెగ హడావుడి చేసింది.
కానీ ఈ చిత్రం కూడా డిజాస్టర్ అయింది. కాగా ప్రస్తుతం 'బాహుబలి' రికార్డులను ఎలాగైనా తిరగరాయలనే పట్టుదలతో ఉన్న శంకర్ 400కోట్ల బడ్జెట్‌తో రజనీ, అక్షయ్ వంటి స్టార్స్‌తో '2.0' చేస్తున్నాడు. మరోపక్క తమిళ దర్శకుడు సుందర్.సి కూడా 350కోట్ల బడ్జెట్‌తో శ్రీతేనాండల్ మూవీస్ బేనర్‌లో ఆర్య..జయం... రవిలు హీరోలుగా 'సంఘమిత్ర' అనే చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు. ఇలా ఇప్పుడు అందరి టార్గెట్ 'బాహుబలి'పైనే ఉంది. మరి వీరి ప్రయత్నాలు ఫలిస్తాయా? లేక 'బాహుబలి పార్ట్2' తో రాజమౌళి ఎవ్వరూ తాకలేని రికార్డులు సృష్టిస్తాడా? అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. చూద్దాం.. ఏం జరుగుతుందో...?