ఆమధ్య హిట్ దర్శకుల వెంటపడి వరుస పరాజయాలతో సతమతమైన యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన పంథా మార్చుకొని, ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. 'టెంపర్' చిత్రం నుంచి ఆయన స్టైల్, స్టోరీల సెలక్షన్‌లో మార్పు వచ్చినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. 'టెంపర్, నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్' వంటి సూపర్‌హిట్స్ తర్వాత ఆయన మరింత జాగ్రత్త పడుతున్నాడు. అదే ఊపును కొనసాగించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. 'జనతాగ్యారేజ్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయన మూడునెలల సమయం తీసుకొని బాబికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.
'పవర్' వంటి యావరేజ్ మూవీ, 'సర్దార్ గబ్బర్‌సింగ్' వంటి డిజాస్టర్స్ ఇచ్చిన యువదర్శకుడు బాబిపై ఉన్న నమ్మకంతో తన 27వచిత్రాన్ని ఆయన దర్శకత్వంలో తన అన్నయ్య కళ్యాణ్‌రామ్ సొంతబేనర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో చేయనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ రిపబ్లిక్ డే కానుకగా జనవరి26 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు ఆయన ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చిత్రం కూడా కన్‌ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని బేనర్‌పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. త్రివిక్రమ్‌తో పవన్ చిత్రం, మరోవైపు ఎన్టీఆర్ బాబితో చేస్తున్న చిత్రాలు రెండు ఆగష్టు నాటికి పూర్తవుతాయి.
దీంతో త్రివిక్రమ్-ఎన్టీఆర్‌ల చిత్రం సెప్టెంబర్ నుండి పట్టాలెక్కనుంది. ఇంతకాలం కేవలం పవన్, బన్నీ, మహేష్‌ల చుట్టూ తిరుగుతోన్న త్రివిక్రమ్ ఈ చిత్రంతో ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేయనున్నాడు. ఇది ఎన్టీఆర్‌కు 28వ చిత్రం కానుంది. ఆ తర్వాత తన 29వ చిత్రాన్ని తనకు 'జనతా గ్యారేజ్' వంటి హిట్ ఇచ్చిన కొరటాల శివతోనే చేయనున్నాడట. తాజా సమాచారం ప్రకారం ఆయన నటించే 30వ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి చేయడానికి ఓకే చెప్పాడనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో విస్తృతంగా జరుగుతోంది. ఇవే నిజమైతే ఇక రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ పవన్, మహేష్, బన్నీ, చరణ్‌లతో పోటీ పడి, టాప్‌రేసులోకి దూసుకుపోవడం ఖాయమంటున్నారు.