బాలీవుడ్ బాద్‌షా, కింగ్‌ఖాన్ వంటి ఎన్నో బిరుదులున్న స్టార్ షారుఖ్‌ఖాన్. కాగా ఈయనకు ఇండియాలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులున్నారు. బాలీవుడ్‌ను ఏలుతున్న ఖాన్ త్రయమైన సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్‌లతో పోటాపోటీ రేసులో ఉండి ఒకానొక దశలో వారి ఫాలోయింగ్‌ను సైతం షారుఖ్ దాటిపోయాడు. కానీ ప్రస్తుతం మాత్రం ఈయన ఒంటరైపోయాడు. ఒకపక్క సల్మాన్, అమీర్‌లు తమ చిత్రాలతో సంచలనాలు సృష్టిస్తుంటే ఈయన మాత్రం రేసులో వెనుకబడిపోయాడు. ఇండియాలోనే 300కోట్ల కలెక్షన్లను సాధించిన సల్మాన్, అమీర్‌ల ఫీట్లను ఆయన ఇంతవరకు చేరుకోకపోవడం గమనార్హం. సల్మాన్ నటించిన 'భజరంగీ భాయిజాన్, సుల్తాన్' చిత్రాలు ఈ ఫీట్లను సాధించాయి. ఇక అమీర్ కూడా ఈ ఫీట్‌ను రెండోసారి సాధిస్తున్నాడు. 'పీకే'తో పాటు తాజాగా విడుదలైన 'దంగల్' మూవీ కూడా ఈ ఫీట్‌కు అడుగు దూరంలో ఉంది. కానీ ఇప్పటివరకు షారుఖ్ మాత్రం ఈ క్లబ్‌లో చేరలేకపోయాడు. ఆయనకు గత మూడేళ్లుగా సరైన బ్లాక్‌బస్టర్ లేదు. ఆయన మూడేళ్ల కిందట నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' ఆయనకు చివరి బ్లాక్‌బస్టర్.
కాగా ఈ చిత్రం మనదేశంలో 225 కోట్ల దగ్గర ఆగిపోయింది. ఇక సల్మాన్, అమీర్‌లు వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకు 500కోట్లకు పైగా వసూలుచేసిన చిత్రాలు చేశారు. ఈ ఫీట్‌ను కూడా సల్మాన్, అమీర్‌లు రెండుసార్లు సాధించారు. కానీ షారుక్ నటించిన చిత్రమైన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' ప్రపంచవ్యాప్తంగా సాధించిన 420 కోట్లు మాత్రమే ఆయనకు హయ్యస్ట్‌గా లభించాయి. మరోవైపు అమీర్ దేశంలో మొదటి 100కోట్లు, మొదటి 200కోట్లు, మొదటి 300కోట్లు సాధించిన ఏకైక హీరోగా కూడా రికార్డుల్లో తన పేరు లిఖించుకున్నాడు. ప్రస్తుతం షారుఖ్ ఆశలన్నీ పక్కా యాక్షన్ చిత్రంగా, మద్యం మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోన్న 'రాయిస్' పైనే ఉన్నాయి. జనవరి 26న విడుదల కానున్న ఈ చిత్రానికి హృతిక్‌రోషన్ నటించిన 'కాబిల్' అదే రోజున విడుదల కానుండటంతో ఈ చిత్రం ద్వారా కూడ షారుక్ ఏకమొత్తంగా కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశాలు లేవని, బిటౌన్ ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. మరి సల్మాన్, అమీర్‌ల సరసన షారుఖ్ ఎప్పుడు, ఏ చిత్రాల ద్వారా చేరుతాడో వేచిచూడాల్సివుంది.....!