వినాయక్ చేతిలో తన కుమారుడి భవిష్యత్తును పెట్టి భారీ బడ్జెట్‌తో 'అల్లుడుశీను' చిత్రం తీశాడు నిర్మాత బెల్లకొండ సురేష్. కానీ ఈ చిత్రంతో ఆయన కుమారుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కి వచ్చిన గుర్తింపు చాలా తక్కువే. సినిమా ఫర్వాలేదనిపించున్నప్పటికీ మితిమీరిన బడ్జెట్ కారణంగా భారీ నష్టాలు వచ్చాయి. ఇక సాయిశ్రీనివాస్ నటించిన రెండో చిత్రం 'స్పీడున్నోడు' ఫ్లాప్ అయింది. అయినా తన కుమారుడిని మాస్‌హీరోగా నిలబెట్టే విషయంలో బెల్లంకొండ సురేష్ ఏ మాత్రం తగ్గడం లేదు. నాగచైతన్య నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో' నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డిని అడ్డుపెట్టి, ద్వారకా ఫిలింస్ బేనర్‌లో మాస్ డైరెక్టర్‌గా ఊపు ఊపుతోన్న బోయపాటి శ్రీనుకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి తన కుమారుడు హీరోగా ఓ చిత్రం నిర్మిస్తున్నాడు. గత కొన్ని చిత్రాల వల్ల, అందునా వివాదాస్పద నిర్మాతగా పేరుతెచ్చుకోవడం వల్ల ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ అంటే ఫైనాన్షియర్ల నుండి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ల వరకు భయపడిపోతున్నారు. దాంతో మిర్యాలను బినామీగా ముందు నిలబెట్టి, వెనక నుండి అన్నీ తానే చూసుకుంటున్నాడు బెల్లంకొండ.
కాగా ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్‌కు, యంగ్ హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్‌లకే కాదు.... ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా డిమాండ్ ఉన్న జగపతిబాబుకు, తమిళ సీనియర్ హీరో శరత్‌కుమార్‌కు కూడా భారీ పారితోషికం ఇచ్చి ఇందులో కీలకమైన పాత్రలకు ఒప్పించాడు. ఇక దర్శకుడు బోయపాటికి, తనకు స్లైలిష్‌స్టార్ బన్నీతో పాటు యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌లకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని ఈ చిత్రంలో వీరిద్దరి చేత కామియో పాత్రలు చేయించడానికి బెల్లంకొండ రెడీ అయ్యాడంటున్నారు. దీనిద్వారా ఈ చిత్రానికి కూడా మంచి హైప్ తేవచ్చనే ముందు చూపుతో ఈ ఇద్దరు స్టార్స్‌కు కూడా భారీ తాయిలాలు ఇచ్చాడని టాక్. ఇటీవలే వైజాగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ పాట చిత్రీకరణకు గాను ఏకంగా 3కోట్లతో భారీ సెట్ వేయించాడట. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పెద్ద పెద్ద టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రానికి కూడా భారీ బడ్జెట్‌ను పెట్టి, డబ్బును నీళ్లలా ఖర్చుచేస్తున్నాడట బెల్లంకొండ సురేష్. మరి ఆయన ఆశలను ఆయన కుమారుడైన హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, బోయపాటిలు ఏ మేరకు నెరవేరుస్తారో వేచిచూడాల్సివుంది....!