గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే రచ్చ జరుగుతుంది. అదేమిటంటే సంక్రాతి బరిలో ఉన్న మెగా హీరో చిరంజీవి నటిస్తున్న ' ఖైదీ నెంబర్ 150' చిత్రం గురించి, బాలకృష్ణ 100 వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' గురించి మెగా అభిమానులు, నందమూరి అభిమానులు మా హీరో సినిమా హిట్ అంటే మా సినిమా హీరో హిట్ అంటూ గొడవ గొడవ చేసేస్తున్నారు. పోనిలే ఫ్యాన్స్ కదా సరదా పడుతున్నారు అంటే ఆహా.. అసలు విషయం అదికాదు. అసలు మెగా ఫ్యాన్స్, నందమూరి ఫాన్స్ కొట్టుకు చచ్చేది మాత్రం కేవలం 'గౌతమీపుత్ర శాతకర్ణి' డైరెక్టర్ క్రిష్ చేసిన ఖబడ్డార్ అనే వ్యాఖలకు, అల్లు అర్జున్ ఈ సంక్రాతి మనదే అనే వ్యాఖ్యలకు. అందులోనూ సోషల్ మీడియా అంతటా ప్రముఖం గా ఈ వార్తలు ప్రచురించడం వల్ల కూడా ఈ గొడవలు జరగడానికి కారణమయ్యాయి.
ఇక ఈ గొడవల గురించి మెగా హీరో నాగబాబు ఒక కార్యక్రమంలో స్పందించాడు. ఒక సినిమా వస్తుంది అంటే అది కేవలం హీరో గొప్పదనమే కాదు. ఒక సినిమా తెరకెక్కాలి అంటే అందులో వేలమంది కష్టించి పని చెయ్యాల్సి ఉంటుంది.... సినిమా హిట్ అయితే అందరూ హ్యాపీగా వుంటారు. అదే ఆ సినిమా ప్లాప్ అయితే ఎంతో మంది బాధపడతారు. అలాంటిది మన సినిమా హిట్ అవ్వాలని... ఎదుటివాళ్ళ సినిమా ప్లాప్ అవ్వాలని కోరుకోకూడదని అంటూ అటు మెగా ఫ్యాన్స్ కి ఇటు నందమూరి ఫ్యాన్స్ కి కలిపి క్లాస్ పీకినట్లు స్పందించాడు. అసలు ఈ గొడవల వాతావరణం సినిమా పరిశ్రమకు మంచిది కాదని.. ఇప్పుడు జరుగుతున్న ఫాన్స్ వార్ ఏ మాత్రం సరైంది కాదని చెబుతున్నాడు.
అలాగే ఈ సంక్రాంతికి విడుదలయ్యే 'ఖైదీ నెంబర్ 150 , గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి' చిత్రాలు సూపర్ హిట్ అవ్వాలని...ఈ పండుగ అందరికి సుఖసంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నాని నాగబాబు తెలిపారు. మరి ఇప్పటికైనా ఫ్యాన్స్ నాగబాబు మాటలను పెడ చెవిన పెట్టకుండా సామరస్యంగా తమ తమ హీరోల సినిమాలే కాకుండా ఇతర హీరోల సినిమాలు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటే మంచిది.