తన కెరీర్ ప్రారంభం నుండి కొత్త దర్శకులను పరిచయం చేయడంలో, విభిన్న చిత్రాలను చేయడంలో నాగ్‌ది ప్రత్యేకశైలి. ఆయన పరిచయం చేసిన ఎందరో దర్శకులు, ఆయన చిత్రాలతో దర్శకులుగా దశతిరిగిన వారు ఎందరో ఉన్నారు. రొమాంటిక్ చిత్రాలనే కాదు, మాస్... భక్తిరస చిత్రాలను, మంచి పాత్ర అయితే ఏ తరహా పాత్రల్లోనైనా నటించడం నాగ్‌కే సొంతం. అందులో ఎక్కువ శాతం చిత్రాలను ఆయన బయటి నిర్మాతలతో చేయకుండా తానే రిస్క్ తీసుకొని, తమ సొంత అన్నపూర్ణ బేనర్‌లోనే నిర్మిస్తుంటాడు. వీరభద్రం చౌదరితో చేసిన 'భాయ్' చిత్రం విడుదలైన వెంటనే ఈ చిత్రం బాగాలేదని, ఈ చిత్రం చూసి అభిమానులు, ప్రేక్షకులు నిరాశపడవద్దని, ఈ చిత్రం చూడవద్దని కూడా చెప్పిన గట్స్ కేవలం నాగ్‌కే సొంతం అని బల్లగుద్ది చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగు సీనియర్ స్టార్స్ అయిన వెంకీ, నాగ్‌లు యంగ్‌హీరోలతో కలిసి నటించడానికి, వినూత్న కథలు రావడానికి ఎంతగానో కష్టపడుతున్నారు. 'సీతమ్మవాకిట్లో...సిరిమల్లె చెట్టు, గోపాలా..గోపాలా, మసాలా' వంటి చిత్రాలు వెంకీ కి ఎలాగో.. నాగ్.. కార్తీతో కలిసి నటించిన 'ఊపిరి' చిత్రం కూడా ఆ కోవలోని చిత్రమే. ఇందులో కేవలం వీల్‌చైర్‌కే పరిమితమైన పాత్ర నాగ్‌లోని కొత్తదనాన్ని వెతికే మనస్తత్వానికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
తాజాగా నాగ్.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటిస్తున్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' ఫిబ్రవరి10న విడుదల కానుంది. ప్రస్తుతం నాగ్.. ఓంకార్ 'రాజుగారి గది2' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. కాగా ఇండస్ట్రీ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం... త్వరలో సీనియర్‌స్టార్ నాగార్జున, విభిన్న చిత్రాలు చేయడంలో ముందుంటున్న యంగ్ హీరో నిఖిల్‌తో కలిసి ఓ చిత్రం చేయనున్నాడని, ఈ ఇద్దరు ఒకేసారి వెండితెరపై దర్శనమివ్వనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి యంగ్‌టాలెంటెడ్ దర్శకుడు చందుమొండేటి దర్శకత్వం వహించనున్నాడట. కాగా కొద్దికాలం కిందట నాగ్.. చందుమొండేటి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడనే వార్తలు వచ్చాయి. మరోపక్క చందు కూడా త్వరలో తాను నిఖిల్‌తో మరో చిత్రం చేయనున్నానని తెలిపాడు. ఈ చిత్రాన్ని చందు ఈ ఇద్దరితో కలిపి చేయనున్నాడట. కాగా నాగ్ కుమారుడు నటించిన 'ప్రేమమ్' చిత్రానికి దర్శకుడు చందునే. మరోపక్క నిఖిల్‌కు తన మొదటి చిత్రంతోనే 'కార్తికేయ' వంటి హిట్ చిత్రం ఇచ్చింది కూడా ఆయనే కావడం విశేషం. దాంతో అటు నాగ్‌కు, ఇటు నిఖిల్‌కు కూడా చందుపై ఎంతో నమ్మకం ఉంది. ఇటీవలే ఆయన నాగ్‌కు, నిఖిల్‌కు కథ వినిపించడం, ఇద్దరికీ నచ్చడంతో దీనికి లైన్ క్లియరైందని సమాచారం. ఈ చిత్రాన్ని కూడా తమ అన్నపూర్ణ బేనర్‌లోనే నిర్మించడానికి నాగ్ సిద్దమయ్యాడు. ఈ చిత్రంలో నాగ్ సరసన 'సోగ్గాడే చిన్నినాయనా' తర్వాత సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరోసారి నటించనుందని, ఇక నిఖిల్ సరసన 'సాహసం శ్వాసగా సాగిపో' ద్వారా పరిచయమైన గౌతమ్‌మీనన్ హీరోయిన్ మంజిమామోహన్ లేదా మెహ్రీన్‌కౌర్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగ్ నటిస్తున్న 'రాజుగారి గది2' చిత్రంతోపాటు, నిఖిల్ నటిస్తున్న 'కేశవ' చిత్రం షూటింగ్ కూడా ఫిబ్రవరికి పూర్తవుతుంది. ఆ వెంటనే మార్చినెలలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో చందు చిత్రం మొదలుకానుందట. దీని గురించి అఫీషియల్ న్యూస్ రావాల్సి వుంది.
మొత్తానికి తన కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో విభిన్న చిత్రాలను చేసిన నాగ్ రూట్‌లోనే ప్రస్తుతం నిఖిల్ కూడా నడుస్తున్నాడు. ఈ విషయంలో వీరిద్దరిని గురుశిష్యులని చెప్పవచ్చు. మరి ఈ వార్తే నిజమైతే ఈ ఇద్దరు హీరోల అభిమానులకు, ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ అభిమానులకు ఇదో తీపివార్త అని చెప్పవచ్చు. మరోవైపు చందుమొండేటికి కూడా ఇది లక్కీ చాన్సే అవుతుంది. ఇక ఈ చిత్రం లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కనుందనే వార్తలు వస్తున్నాయి. చిరు, బాలయ్యల వంటి సీనియర్ స్టార్స్ మాత్రం ఇప్పటికే సోలో హీరోలుగానే నటించడానికి తాపత్రయపడుతున్నారు. చిరు మాత్రం కేవలం తన కుమారుడి చిత్రాలలో మాత్రమే అతిధిపాత్రలు చేశాడు. బాలయ్య.. మోహన్‌బాబు కోసం 'ఊ కొడతారా... ఉలిక్కిపడతారా'లో మాత్రమే నటించాడు. వీరిద్దరు కూడా నాగ్, వెంకీల తరహా చిత్రాలకు శ్రీకారం చుడతారా ? లేదా అనేది చూడాలి.