గీతాఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్‌ది మాస్టర్‌బ్రెయిన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ చిత్రాన్ని తానే సొంతంగా నిర్మించాలి? ఎలాంటి చిత్రాలను భాగస్వామ్యంతో నిర్మించాలి? అనే విషయం అల్లుకి తెలిసింతగా,మరెవ్వరికీ తెలియదనే చెప్పాలి. కేవలం ప్రీరిలిజ్ బిజినెస్‌లోనే టేబుల్ ప్రాఫిట్ వచ్చేచిత్రాలను, తనకున్న ఇమేజ్ కేవలం తెలుగుకే పరిమితమని గ్రహించిన ఆయన ఇలా చిత్రాలను నిర్మించడంతో తన సత్తా చూపుతున్నాడు. కాగా ఆయన కొన్ని చిన్నహీరోలు, మీడియం హీరోలతో చేసే చిత్రాలకు, ముందుగానే టేబుల్ ప్రాఫిట్ రాదని తెలిసిన చిత్రాలను ఇతరుల భాగస్వామ్యంతో నిర్మిస్తుంటాడు. ఆమధ్య ఆయన నానిహీరోగా మారుతి దర్శకత్వంలో తీసిన 'భలే భలే మగాడివోయ్' చిత్రాన్ని యువి క్రియేషన్స్‌తో కలిసి నిర్మించాడు. ఈ చిత్రం ఘనవిజయం సాధించి బాగా లాభాలను తెచ్చిపెట్టింది. తాజాగా ఆయన కన్నడంలో నిర్మాతగా పేరున్న ఆర్థిక స్థోమత, పలుకుబడి ఉన్న రాక్‌లైన్ వెంకటేష్ భాగస్వామ్యంలో 'భలే భలే మగాడివోయ్' చిత్రాన్ని కన్నడలో 'సుందరంగ జానా' పేరుతో రీమేక్ చేశాడు. రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గణేష్,శాన్వి జంటగా నటించారు. డిసెంబర్23న విడుదలైన ఈ చిత్రం కన్నడలో సూపర్ కలెక్షన్లు రాబడుతోంది. ఈచిత్రంతో మరలా అల్లుఅరవింద్‌కు బాగా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక ఆయన తన తనయుడు అల్లుఅర్జున్‌ను తమిళంలోకి కూడా పరిచయం చేస్తూ త్వరలో లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రెండు భాషల్లోనూ తానే నిర్మించగల ఆర్థికస్తోమత ఉన్నప్పటికీ తెలుగు వెర్షన్‌ను మాత్రమే తాను నిర్మిస్తూ, తమిళ వెర్షన్‌ను కోలీవుడ్‌లో మంచి పట్టున్న స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్‌రాజా చేతిలోపెట్టాడు. సో..అల్లు అరవింద్ ప్లానింగ్ చూసిన నిర్మాతలందరూ..ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలనే భావనలో వున్నారు.