వాస్తవానికి పవన్‌కు తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా డిజాస్టర్ అయినా కూడా దానిని ఎవ్వరు పరిగణనలోకి తీసుకోరు. తదుపరి చిత్రంపై కూడా భారీ అంచనాలు రేకెత్తించగల సామర్ధ్యం పవన్‌కి ఉంది. ఆయన ఒక్కడే సినిమా మొత్తం ఒంటి చేత్తో నడపగలడు. ఆయన కాళ్లు మాత్రమే చూపిస్తూ విడుదలవుతున్న ప్రీలుక్ పోస్టర్స్ సైతం పెద్ద స్థాయిలో అందరినీ ఆకట్టుకుంటుండమే దీనికి ఓ ఉదాహరణ. ఆయన కిందటి చిత్రం 'సర్దార్‌గబ్బర్‌సింగ్' డిజాస్టర్ అయినప్పటికీ 'కాటమరాయుడు'పై ఆ స్థాయి అంచనాలున్నాయంటేనే అది నిజమేనని అర్థమైపోతుంది. 'సర్దార్' చిత్రంతో పవన్ బాలీవుడ్, కోలీవుడ్ వంటి భాషల్లో కూడా క్రేజ్ సాధించాలని ప్రయత్నించినా ఆయనకు ఆ విషయంలో పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఆయన తమిళంలో అజిత్, విజయ్‌ల లాగా కేవలం టాలీవుడ్‌పై మాత్రమే ఫోకస్ చేస్తే మేలని పలువురు సినీ పండితులు కూడా విశ్లేషిస్తున్నారు.
కాగా ప్రస్తుతం ఆయన చేస్తోన్న 'కాటమరాయుడు' చిత్రం తమిళ 'వీరం' ఆధారంగా తెరకెక్కుతుండటంతో ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో రిలీజ్ చేసే యోచన పవన్‌కు లేదని అర్ధమవుతోంది. కానీ త్రివిక్రమ్‌తో ఆయన చేయబోయే చిత్రాన్ని మాత్రం మరోసారి తమిళ, మలయాళ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయాలనే ఆలోచనలో పవన్-త్రివిక్రమ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది త్రివిక్రమ్ ఓన్ సబ్జెక్ట్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ చిత్రానికి తమిళంలో క్రేజ్ కోసం ఖుష్బూను, మలయాళంలో మంచి క్రేజ్ రావడం కోసం మోహన్‌లాల్‌ను భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ పెట్టుకోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.