స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఉన్నప్పుడే నటునిగా, దర్శకునిగా తన టాలెంట్ చూపించుకోవాలని భావించిన లారెన్స్ తమిళంలో ఈ విషయంలో బాగా సక్సెస్ అయ్యాడు. కానీ ఆయన తెలుగులో తీసిన 'డాన్, రెబెల్' చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఆయనకు తెలుగులో అవకాశాలు లేవు. ఈ చిత్రాల విషయంలో ఆయన టాలీవుడ్‌లో పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా తమిళంలో ఆయనే హీరోగా, దర్శకునిగా చేసిన 'ముని' సీక్వెల్స్ తెలుగులో కూడా పెద్ద హిట్స్‌గా నిలిచి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. కల్యాణ్‌రామ్ హీరోగా వచ్చి అద్బుత విజయం సాధించిన 'పటాస్' చిత్రం తమిళ రీమేక్‌లో ఆయన ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ చిత్రం రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి భారీ రేటుకు సొంతం చేసుకున్నాడు.
ఈ చిత్రం సూపర్ గుడ్‌ఫిల్మ్‌స్ బేనర్‌లో రూపొందుతోంది. ఈ 'పటాస్' రీమేక్ 'మొత్త శివ- కొట్ట శివ' అనే టైటిల్‌తో రిలీజ్ కానుంది. కానీ ఈ చిత్రం రిలీజ్‌ను ఆపివేయాలంటూ తనకు పలు బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, తనకు పోలీస్ భద్రత కల్పించాలని లారెన్స్ చెన్నై పోలీస్‌కమిషనర్‌ను కోరాడు. ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ, మొదట నేను వేందల్ మూవీస్ మదన్‌తో ఓ చిత్రం చేయాలనుకున్నాను. ఆ చిత్రానికి నేనే స్క్రీన్‌ప్లే రాసుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టి 'పటాస్'ను రీమేక్ చేస్తున్నాం. ఈ చిత్రం కథకు, నా సొంత స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించాలని భావించిన చిత్రానికి అసలు సంబంధం లేదు. కానీ కొందరు నాకు ఫోన్ చేసి, సినిమా విడుదలకు ముందు మదన్‌తో సంప్రదించాలని బెదిరిస్తున్నారన్నాడు. కాగా ఈ చిత్రంలో లారెన్స్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నప్పటికీ ఇందులో కూడా నటునిగా తనకు అచ్చివచ్చిన గుండునే సెంటిమెంట్‌గా భావించి, అలాగే కనిపించనున్నాడని సమాచారం.