రెజ్లర్ మహావీర్ పొగట్ తన ఇద్దరు కూతుళ్లయిన బబిత, గీతలను రెజ్లింగ్ ఛాంపియన్లుగా తీర్చిదిద్దిన వైనాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం 'దంగల్' ఎన్నో ప్రశంసలతో పాటు దుమ్మురేపే కలెక్షన్లను కూడా సాధిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంపై ప్రముఖ రెజ్లింగ్ కోచ్ పీఆర్ సోధి తీవ్ర విమర్శలు సంధించి, ఈ చిత్రం విషయంలో న్యాయపోరాటానికి సిద్దమవుతున్నాడు. ఈయన బబిత, గీతలకు 2010లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో జాతీయ కోచ్‌గా వ్యవహరించాడు. ఈ చిత్రంలో క్లైమాక్స్‌లో నెగటివ్‌గా చూపించే కోచ్ పాత్ర తనదేనని ఆయన మండిపడుతున్నాడు.
ఈ విషయంలో ఆయన అమీర్, డైరెక్టర్ నితీష్‌తివారిలను తీవ్రంగా విమర్శిస్తున్నాడు. మహావీర్ తనకు చాలా మంచి మిత్రుడని, కావాలంటే ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులను అడిగినా చెబుతారంటున్నాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహావీర్ కూతుర్లయిన బబిత, గీతలకు మహావీర్ మాత్రమే కాకుండా నలుగురు కోచ్‌లు ఉన్నారు. వారిని చిత్రంలో ఎందుకు చూపించలేదు. ఇక క్లైమాక్స్‌లో గీత ఫైనల్ మ్యాచ్‌ను ఆయన తండ్రి చూడకుండా ఓ గదిలో బందించినట్లు చూపించారు. నా పాత్రను ఎంతో ఇగో ఉన్నట్లుగా నెగటివ్‌గా చిత్రీకరించారు. నేను మహావీర్ కూతుర్లకు శిక్షణ ఇచ్చే సమయంలో మహావీర్ అసలు జోక్యం చేసుకోలేదు.
ఆయన ఎంతో మంచివాడు. కానీ ఈ చిత్రంలో మాత్రం తన పాత్ర బబితను తప్పుదారి పట్టించే విధంగా, ఆయన తండ్రి రెజ్లింగ్ విషయంలో చెప్పిన కిటుకులకు నేను అడ్డుపడ్డట్లుగా చూపించారు.ఇలా నన్ను వక్రీకరించి చెడుగా చూపి, వాస్తవాలు చూపించకుండా తనలాంటి వారిని మానసిక క్షోభకు గురిచేయడం సమంజసం కాదు. ఈ విషయంలో నేను న్యాయపోరాటం చేయనున్నానని ఈ 70ఏళ్ల సోధి ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ ఈ చిత్రం ప్రారంభంలోనే మహావీర్, బబిత, గీతల పాత్రలు తప్ప మిగిలినవన్నీ కల్పితం అని కూడా వేశారు. దీంతో సోధి చేసే న్యాయపోరాటం ఫలించే సూచనలు కనిపించడం లేదని బి-టౌన్ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.