పీవీపీ, వంశీ పైడిపల్లి మొన్నటి వరకు మంచి జిగిరీలు. ఏకంగా ఊపిరి సినిమా ప్రెస్ మీట్ లో ఒకసారి ప్రసాద్ పొట్లూరి నాకు బ్రదర్ లాంటివాడని… నాకు ఆయనే లైఫ్ ఇచ్చారని తెగ మెచ్చుకున్నాడు. అస్సలు పొట్లూరి ట్రీట్ చేసే విధానం అద్భుతం.. ’అంటూ కూడా వంశీ పైడిపల్లి తెగ మురిసిపోతూ పొట్లూరిని తెగ పొగిడేశాడు. అదే విధంగా పీవీపీ కూడా అంతేస్థాయిలో.. ‘వంశీ చాలా టాలెంటెడ్.. అనీ, ఇంకా అస్సలు అలాంటి దర్శకుడు నాకు దొరకడం నాకు చాలా అదృష్టం’ అని తెగ మాట్లాడేశాడు కూడాను.
ఇప్పుడు వారిద్దరి మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒక్క క్షణం కూడా పడడం లేదు. ఏకంగా పొట్లూరి, వంశీపై ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు కూడా చేశాడు. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగిందంటే.. ఊపిరి సినిమా చేసే సమయంలో వంశీ పైడిపల్లితో మరొక సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది పీవీపీ సంస్థ. అయితే పొట్లూరి ప్లాన్ అప్పట్లో ఏం ఉండేదంటే.. వంశీ – మహేష్ కాంబినేషన్‌లో ఓ సినిమా తీయాలని గట్టిగా బలంగా నాటుకుపోయింది. అప్పట్లో మహేష్ కూడా ఓకే అన్నాడు. కాగా ఆ సినిమా కాస్తా లేట్ అవుతూ వస్తుండటంతో, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకు సినిమా చేయడం కష్టమని తెలిసి మహేష్ తాను తీసుకొన్న అడ్వాన్సును ఈ మధ్యనే తిరిగి పంపించిన విషయం తెలిసిందే.
అయితే మహేష్ బాబు ఎప్పుడైతే చల్లగా పీవీపీ నుండి తప్పించుకున్నాడో.. వంశీ పైడిపల్లి కూడా పీవీపీ సంస్థ నుండి బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇది కాస్తా పొట్లూరికి తెలిసిపోయింది. ఒక్కసారి దిమ్మతిరిగిన పొట్లూరికి పైడిపల్లి.. చేస్తే గీస్తే నా సంస్థలోనే సినిమా చేయాలి, బయటకు వెళ్ళే ఉద్దేశం ఉంటే నష్టపరిహారం కట్టాల్సిందే నంటూ నిలదీయటం మొదలెట్టాడు. ఇప్పుడు అది కాస్తా ఫిల్మ్ ఛాంబర్ మెట్లెక్కింది. తెలుగు ఫిల్మ్ చాంబరే కాకుండా తమిళ ఫిల్మ్ ఛాంబర్‌లో కూడా వంశీపై పొట్లూరి ఫిర్యాదు చేశాడు. పొట్లూరి పోరాటం ఏంటంటే... సుమారు ఆరు నెలల పాటు నా ఆఫీసులో కూర్చుని కథ తయారు చేసిన పైడిపల్లి, ఆ కథను తీసుకెళ్ళి మరో బ్యానర్ లో చేస్తాననడం సరికాదని, ప్రస్తుతం ఆ కథపై ఉండే సర్వహక్కులూ తమ సంస్థకే చెందుతాయని పొట్లూరి ఫిర్యాదులో తెలిపాడు. మొత్తానికి వంశీ పైడిపల్లిని ఎటూ కదలనివ్వకుండా అలా లాక్ చేసేశాడన్న మాట. చూద్దాం దీనిపై వంశీ ఎలా స్పందిస్తాడో.. మొత్తానికి సినిమా వ్యవహారాలు చాలా విచిత్రంగా ఉంటాయి.