తమిళ సీనియర్ కమెడియన్‌గా వడివేలుకు ఎంత పేరుందో అందరికీ తెలిసిన విషయమే. పలు తమిళ డబ్బింగ్ చిత్రాల ద్వారా ఆయన తెలుగులో కూడా బాగా పాపులర్. తెలుగులో అప్పుడు బ్రహ్మానందంకు ఎంతటి భీభత్సమైన ఫాలోయింగ్ ఉందో... తమిళంలో వడివేలుకి అంతకు మించిన క్రేజ్ ఉండేది. కానీ ఆయన కిందటి ఎన్నికల్లో కాకుండా ఆ ముందు జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే పార్టీ తరపున ప్రచారం చేశాడు. ఈ సందర్భంగా ఆయన రజనీకాంత్‌తో సహా పలువురు స్టార్స్‌ను, స్వర్గీయ జయలలితను ఘాటుగా విమర్శించాడు. కానీ ఆ ఎన్నికల్లో డిఎంకె ఓడిపోయి, జయలలిత ముఖ్యమంత్రి ఆయ్యారు. అక్కడి నుంచి ఆయన కెరీర్ పడిపోయింది.
ఒకప్పుడు రజనీ సైతం తనతో సినిమాలు తీయడానికి నిర్మాతలు, దర్శకులు వచ్చినప్పుడు ముందుగా వడివేలు కాల్షీట్స్ తీసుకోమని సలహా ఇచ్చేవాడంటే ఆయనకు అప్పుడున్న క్రేజ్‌ను, డిమాండ్‌ను మనం అర్ధం చేసుకోవచ్చు. కానీ రజనీతో పాటు పలువురు స్టార్స్‌పై ఆయన అనవసరపు విమర్శలు చేయడంతో సంతానంను కమెడియన్‌గా అందరూ ఎంకరేజ్ చేశారు. దాంతో ఆయన స్థానాన్ని సంతానం ఆక్రమించాడు. కానీ ఇన్నేళ్లకు ఆయనకు ఓ తెలుగువాడైన తమిళ హీరో విశాల్ పునర్జన్మనిచ్చాడు. ఇటీవల విడుదలైన 'కత్తిసందై' '(ఒక్కడొచ్చాడు) చిత్రంలో ఆయన వడివేలుకు అవకాశం ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ఈ సీనియర్ కమెడియన్‌కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయనకు విజయ్ 61వ చిత్రం, జి.వి.ప్రకాష్ హీరోగా నటించే సినిమా, లారెన్స్ 'శివలింగ' చిత్రాలలో మంచి అవకాశాలు వచ్చాయి. మరి ఈ సీనియర్ కమెడియన్ మరలా తన పాత మ్యాజిక్‌ను రిపీట్ చేయగలడా? సంతానం, వివేక్ వంటి కమెడియన్ల ధాటికి నిలబడగలడా? అనేవి వేచిచూడాల్సివుంది.