ప్రస్తుతం 'వంగవీటి' చిత్రాన్ని తీసిన వర్మపై కాపు నాయకులు, రంగా అభిమానులు, మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన సామాన్యులు కూడా మండిపడుతున్నారు. కానీ వీటికి వర్మ మాత్రం ఏం జంకడం లేదు. వంగవీటి గురించి మీరు కూడా సహించలేని ఎన్నో వాస్తవాలు నా దగ్గర ఉన్నాయి. కానీ రంగా మీద అభిమానంతో వాటిని తీయలేదు. మీకు దమ్ముంటే మీకు తెలిసిన వంగవీటి గురించి మరో సినిమా తీసుకోండి అని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. కానీ దీనిపై వంగవీటి కుటుంబసభ్యులు గానీ, ఆయన ఫ్యాన్స్‌గానీ సరిగ్గా స్పందించలేకపోయారు.
కాగా కులాన్ని అడ్డుపెట్టుకొని, ఫైట్‌మాస్టర్‌గా, ఆ తర్వాత చిన్న చిన్న విలన్లు వేషాలు చేస్తూ, ఆమధ్య దర్శకునిగా మారి నితిన్ హీరోగా 'హీరో', శ్రీకాంత్ హీరోగా 'రంగా ది దొంగ' వంటి డిజాస్టర్ చిత్రాలను తీసి, నిర్మాతలను ముంచేసిన జీవి మాత్రం వర్మ సవాల్‌కు కోపం వచ్చి, ఆ సవాల్‌ను స్వీకరించాడు. ఆమధ్య కాంగ్రెస్ పార్టీలో చేరి, తాజాగా కాపు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న జీవి ఇటీవల ముద్రగడకు మద్దతుగా చంద్రబాబును విమర్శిస్తూ ఏకంగా ఓ ప్రెస్‌మీట్ కూడా పెట్టిన సంగతి తెలిసిందే. కులరాజకీయాలతో పైకెదగాలని భావిస్తున్న ఆయనకు ప్రస్తుతం దర్శకునిగా అవకాశాలు లేవు. ఏ నిర్మాత ఆయనతో సినిమాలు తీయడానికి ముందుకు రావడం లేదు. దీంతో వర్మ సవాల్‌ను స్వీకరించి, తద్వారా వార్తల్లో నిలవడమే కాకుండా, నిర్మాతలను కూడా చేజిక్కించుకోవచ్చని ఊహించిన జీవీ, తాను వంగవీటి గొప్పతనాన్ని తెలియజేస్తూ, వచ్చే ఏడాది ఇదే సమమానికి సినిమాను విడుదల చేస్తానని వర్మకు ప్రతిసవాల్ విసిరాడు.
మొత్తానికి ఈ విషయంలో జీవీ పాచిక బాగానే పారిందంటున్నారు. ఆర్థికంగా బలవంతులైన కాపు సామాజిక వర్గానికి చెందిన వారితో పాటు ఇండస్ట్రీలోని దాసరి వంటి వారు, రంగా, రాధా మిత్రమండలి సభ్యులు ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. కాగా ఎప్పుడెప్పుడో ధవళసత్యం దర్శకత్వంలో వచ్చిన 'చైతన్యరథం'చిత్రం కూడా వంగవీటి చరిత్రను ఎంతో గొప్పగా చూపించిన చిత్రమే కావడం గమనార్హం. అప్పట్లో ఈ చిత్రం బాగా ఆడింది. మరలా దీనికి సీక్వెల్‌గా 'చైతన్యరథం2' చిత్రాన్ని తీయాలని భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. మరి జీవీ తన చిత్రాన్ని ఎలా తీస్తాడో? వేచిచూడాల్సివుంది.