ప్రస్తుతం బాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు, విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న హీరోయిన్ కంగనారౌనత్. ముక్కుసూటిగా వాస్తవాలను కుండబద్దలు కొట్టే ఈమెకు అక్కడ ఫైర్‌బ్రాండ్ అనే పేరుంది. ఆమధ్య ఎప్పుడో వచ్చిన పూరీ-ప్రభాస్‌ల 'ఏక్ నిరంజన్' చిత్రం ద్వారా ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. కాగా ఆమె ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, పలువురు సినీ ప్రముఖుల వారసురాళ్లుగా పరిచయమవుతున్న వారి సంగతేమో గానీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరోయిన్లుగా పరిచయం అయ్యే వారిని దర్శకనిర్మాతలు, హీరోలు లైంగికంగా వాడుకొంటారని సంచలన ప్రకటన చేసింది. తాజాగా మరోసారి ఆమె అదే మాటను మరలా పేర్కొంది. నాలాంటి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చే వారిని సినిమా ఫీల్డ్‌లో అందరూ వాడుకుంటారు. ఎలాంటి అండదండలు లేకుండా హీరోయిన్లుగా ఎదిగిన వారందరికి ఈ పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. ఇది పచ్చి వాస్తవం. ఎందుకంటే నన్ను కూడా అలా వాడుకున్నారు. ఆ స్థితిని నేనే స్వయంగా అనుభవించాను. మరికొందరిని ప్రత్యక్షంగా చూశాను. వారి పేర్లు బయటపెట్టదలుచుకోలేదు. నేను నిజాలే మాట్లాడుతాను. ఈ విషయం కూడా పచ్చి వాస్తవం కాబట్టే నా వ్యాఖ్యలను తప్పుపట్టే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోతున్నారు... అని తెలిపింది.
ఇక 'పద్మావతి' చిత్రం కోసం దీపికా 13కోట్లు అడిగితే మీరు 15కోట్లు డిమాండ్ చేస్తున్నారట కదా..! అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అది నా ఇష్టం. నాకున్న డిమాండ్‌ను బట్టి నేను అడుగుతాను. ఫలానా వారు ఇంతే అడిగారు. మీరు ఇంత అడుగుతున్నారనే వాటికి నేను సమాధానం చెప్పను. అది నాఇష్టం. అంత ఇచ్చుకోగలిగిన నిర్మాతలే నా వద్దకు వస్తారు.. అని కుండబద్దలు కొట్టింది. తాను త్వరలో చేయబోయే 'రాణిలక్ష్మీభాయ్' చిత్రం తనకు 'క్వీన్' కంటే పెద్ద పేరు తెస్తుందని, ఈ చిత్రంలో తానే గుర్రపుస్వారీ చేయనున్నానని, అందుకోసం జర్మనీలో కఠోరశిక్షణ తీసుకున్నానని వెల్లడించింది. మహిళా స్వేచ్చ గురించి ఉపన్యాసాలు దంచేవారు... నేను స్వేచ్చగా చెబుతున్న వాస్తవాలను మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని సెటైర్ విసిరింది.