తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆ రాష్ట్రంలో రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. నిజం చెప్పాలంటే అక్కడి రాజకీయాలు రోజుకో రంగును పులుముకొని సరికొత్త అవతారాలు ఎత్తుతున్నాయని చెప్పవచ్చు. అది ఎలాగంటే.. ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పి. చిదంబరం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలవడం తమిళనాట పలు చర్చలకు దారితీస్తుంది. ఈ మధ్య రజనీకాంత్ నివాసంలో వీరి భేటీ జరిగినట్లు తెలుస్తుంది. చిదంబరమే స్వయంగా రజనీకాంత్ ఇంటికి వచ్చినట్లు తెలుస్తుంది.
అయితే ఇంతవరకు రజనీకాంత్ ఏ ఒక్క రాజకీయ పార్టీకి మద్దతు తెలపని విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ముఖ్యంగా దేశం, తమిళనాడు రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఇంకా పెద్దనోట్ల రద్దు విషయంపై కూడా చర్చించినట్లు తెలుస్తున్న అంశం. కాగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు రజనీ అంటే గౌరవం ఉంది. బహుశా చిదంబరం కూడా అలాంటి గౌరవంతోనే కలిసి తమిళనాట జరుగుతున్న రాజకీయ పరిస్థితులను కూర్చొని తాపీగా చర్చించుకున్నట్లు తెలుస్తుంది. ఆయా విషయాలపై పూర్తిగా అవగాహన పూర్వకంగా చిదంబరం రజనీకాంత్ కు వివరించినట్లు తెలుస్తుంది.
అది అలా ఉంచితే తమిళనాడులో రాజకీయాలు రోజురోజుకూ కొత్త కొత్త చర్చలకు దారితీసి ఎవరికీ అంతుపట్టని చందంగా మారిపోతున్నాయనడానికి మరో ఉదాహరణ ఏంటంటే... ఇప్పటివరకు అంతా నేతలు కూడా శశికళ వైపే అనుకూలంగా ఉన్నారని భావించినా ఇప్పుడు మాత్రం అంతా తారుమారు అయినట్లుగా జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఉన్నట్టుండి హఠాత్తుగా తమిళ హీరో అజిత్, శశికళను కలిసి చాలా సేపు చర్చించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ భేటీ ఉద్దేశ్యం ఏంటంటే... శశికళ అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన తర్వాత అజిత్ మద్దతు కోసం ముందుగా ఒప్పందాలు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి జయలలిత సహచరిగా ఉండి రాజకీయాలన్నీ ఒంటపట్టించుకున్న శశికళ ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ బుట్టలో వేయాలో బాగానే చేసేస్తుందన్నమాట.
పోయెస్ గార్డెన్ లో అజిత్, శశికళ సమావేశం అయ్యినట్టు అన్నాడీఎంకే వర్గాలు ధ్రువీకరించగా అజిత్ ఇంతవరకు ఈ విషయంపై ఏ మాత్రం స్పందించలేదు. జయలలిత అంటే అమిత గౌరవం ఉన్న అజిత్ కు క్రిస్మస్ వేడుకల నిమిత్తం కుటుంబ సభ్యులతో బల్గెరియా వెళ్ళి, తిరిగి చెన్నై చేరుకున్న వెంటనే శశికళతో భేటీ కావడంపై అందరిలోనూ అనుమానాలకు తావిస్తుంది.