సంచలనాత్మక దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వంగవీటి’ చిత్రం చుట్టూతా చాలా వివాదాలు రాజుకుంటున్న విషయం తెలిసిందే. రెండు భిన్న సామాజిక వర్గాల మధ్య తీవ్ర ఆవేశాలకు లోనుచేసే చిత్రంగా దీన్ని చూస్తూ బెజవాడ ప్రాంత ప్రజలు ఆగ్రహంతో పెట్రేగిపోతున్న విషయం కూడా తెలిసిందే. అయితే తమ వర్గాన్ని తక్కువ చేసి చూపించారని వంగవీటి అభిమానులు ఈ మధ్య వర్మపై గట్టిగానే కౌంటర్లు వేశారు. అయితే దానికి ఏమాత్రం వెరవకుండా వర్మ కూడా అంతేస్థాయిలో వారందరికీ ధీటుగానే సమాధానం చెప్పాడు. అది కాస్త ముదిరి పాకాన పడి వర్మ వర్సెస్ వంగవీటి ఫ్యాన్స్ ల మధ్య మాటల తూటాలు రాజుకున్నాయి. వీరి ఘర్షణను చూడబోతే ఎలా ఉందంటే వర్మ తీసిన ‘వంగవీటి’ చిత్రం కంటే అత్యంత రంజుగా ఈ వీరిమధ్య కోలహలం నడుస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఫిల్మ్ ఛాంబర్‌లో ‘దేవినేని’ పేరుతో కొత్త టైటిల్ రిజిస్టర్ అయింది. అంతే కాకుండా ఈ టైటిల్ కింద ఇది ‘రెండు కుటుంబాల కథ’ అనే ట్యాగ్ లైన్ కూడా రాసి ఉంది. దీన్ని బట్టి చూస్తే వంగవీటి సినిమా నేపధ్యంలో కావాలనే దేవినేని చిత్రాన్ని తీయాలన్న సంకల్పంతో ఈ టైటిల్ రిజిష్టర్ చేసినట్లు వ్యక్తమౌతుంది. వర్మ ‘వంగవీటి’ చిత్రంలో వంగవీటి నెగిటీవ్ షేడ్స్ చూపించినట్లుగా.... దేవినేని అన్న పేరుతో తెరకెక్కబోయే ఈ చిత్రంలో దేవినేని నెగెటివ్ షేడ్స్ కూడా చూపే ప్రయత్నంలో భాగంగా ఈ టైటిల్ పై తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా క్యాప్షన్ ను బట్టి చూస్తే ఇది పక్కాగా విజయవాడ రాజకీయాలు, వారు అప్పట్లో సాగించిన గొడవలు, ఆ నేపధ్యంలోనే తెరకెక్కించనున్నట్లు అర్థమౌతుంది. మొత్తానికి ఈ టైటిల్ ను ఎవరు రిజిష్టర్ చేశారన్న విషయం తెలియడం లేదు. కానీ... పక్కాగా ఈ వంగవీటి సినిమా ప్రభావంతోనే ఈ దేవినేని చిత్రం కూడా టైటిల్ ను క్యాష్ చేసుకోడానికో... లేకా త్వరత్వరగా దేవినేని పేరుతో మరో సినిమా తీయడానికో మాత్రం ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయని ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తుంది.