బాలీవుడ్ నెంబర్‌గేమ్‌లో సల్మాన్, షారుఖ్‌లు ఎప్పుడూ ముందుంటారు. ప్రేక్షకులు, ట్రేడ్‌వర్గాలు కూడా అలానే భావిస్తూ ఉంటాయి. ఈ రేసులో అమీర్ పేరు పెద్దగా వినిపించదు. అమీర్ కూడా తాను ఆ రేసులో లేనని నిగర్వంగా చెబుతుంటాడు. కానీ ఆయన మాట్లాకపోయినా, ఆయన నటించే చిత్రాలే ఎక్కువగా మాట్లాడుతుంటాయి. ఎన్ని చిత్రాలు చేశామన్నది కాకుండా.... ఎలాంటి చిత్రాలు చేశామనే దానిపై మిష్టర్‌పర్‌ఫెక్షనిస్ట్ దృష్టి ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఆయన నటించిన 'దంగల్' చిత్రానికి వస్తున్న ప్రశంసలు, కలెక్షన్లను చూస్తే ఆయన అనితరసాధ్యుడని చెప్పవచ్చు. ఈ చిత్రం దేశంలోని కరెన్సీ కొరత అనే మాటను తుత్తునియలు చేస్తోంది.
కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా 190కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇండియాలోనే ఈ చిత్రం 106కోట్లు కలెక్ట్ చేయగా, ఓవర్‌సీస్‌లో 85కోట్లు వసూలు చేసింది. లాంగ్‌రన్‌లో ఈ చిత్రం కేవలం ఇండియాలోనే 300కోట్లు వసూలు చేయడం గ్యారంటీ అని ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ ఫీట్‌ను అమీర్ రెండోసారి సాధించినట్లు అవుతుంది. ఆయన నటించిన 'పికె' చిత్రం కూడా ఈ ఫీట్‌ను మొదట సాధించింది. ఇక ఈ చిత్రంపై కరెన్సీ ఎఫెక్ట్‌తో పాటు అమీర్ ఆ మద్య చేసిన 'అసహనం' వ్యాఖ్యల ప్రభావం ఖాయమని కొందరు ఊహించారు. కానీ అమీర్ మాత్రం తాను అన్నింటికీ అతీతుడినని మరోసారి నిరూపించుకున్నాడు.