మిష్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ నటించిన తాజా చిత్రం 'దంగల్' పై కలెక్షన్ల కనకవర్షంతోపాటు మేథావుల నుండి, విమర్శకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ చిత్రాన్ని ఇటీవల ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త చిన వీరభద్రుడు కాకతాళీయంగా చూడటం జరిగిందట. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ, మా పిల్లలు ఇటీవల 'దంగల్' చిత్రానికి టిక్కెట్స్ బుక్ చేసి, నన్ను బలవంతం మీద ఆ చిత్రానికి తీసుకెళ్లారు. కానీ అది హిందీ చిత్రమని తెలుసుకొని నిరుత్సాహపడ్డాను. ఆ భాషపై నాకు పెద్దగా పట్టులేదు. దాంతో ఎందుకురా...! ఈ చిత్రం చూడటం అనుకున్నాను. కానీ సినిమా మొదలైన 20 నిమిషాలలోనే నేను ఆ కథలో లీనమైపోయాను.
నేనో ప్రత్యేక చిత్రం చూస్తునానన్న సంగతి నాకు అర్ధమైపోయింది. చిత్రం సగభాగం పూర్తయ్యే సరికి నేను తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాను. చివరి అరగంట సినిమా చూసిన తర్వాత నా కళ్లు నాకు తెలియకుండానే వర్షించడం మొదలయింది. సినిమా ముగిసి, థియేటర్లలో దీపాలు వెలగగానే నా కంటి నీటిని దాచుకోవడానికి ఎంతోకష్టపడ్డాను. కాగా ఈ చిత్రం అమ్మాయిలు, అబ్బాయిలు, మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన చిత్రం. టూరింగ్ టాకీస్‌ల్లో ఆనాటి కొన్ని సాంఘిక చిత్రాలను చూసి నాటి గ్రామీణ మహిళలు ఏడవడం వంటి సంఘటనలు నాకు తెలుసు. వారిలోని నిర్మలమైన, స్వచ్చమైన మనసే దానికి కారణం. ఈ చిత్రం చూస్తూ, నేను కూడా ఏడుస్తుంటే అలాంటి స్వచ్చమైన మనస్సు ఏదో ఇంకా నాలో కూడా ఉన్నట్లు అర్ధమైంది.
ఈ చిత్రంలో నటించిన పాత్రలన్నీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇందులో నటించిన అమీర్‌ఖాన్ అనే నటుడి గత చిత్రాలేవీ నేను చూడలేదు.కానీ ఈ ఒక్క చిత్రం చాలు... నేను చూసిన మహానటుల జాబితాలో ఆయన్ను చేర్చడానికి. కాగా ఇలాంటి సంఘటనలు మన మధ్య జరగడం లేదా? వాటిని మనం గుర్తించలేకున్నామా? ఇలాంటి పాజిటివ్ కథలను, పాత్రలను, చిత్రాలను మన పిల్లలకు అందించాల్సిన అవసరం మనకి లేదా? మన తెలుగు సినిమాలలో, ఇంకా చెప్పాలంటే తెలుగు సాహిత్యంలో కూడా ఇలాంటి ఆదర్శాలు రువైపోతున్నాయి. మన పిల్లలు పర్వర్టెడ్ చిత్రాలు, హీరోలు, డైరెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా పర్వర్టెడ్‌నెస్ అనే దాని వెనుక పడటం మన సాంఘిక- రాజకీయాలపై కూడా తీవ్ర దుస్ఫరిణామాలు చూపిస్తున్న విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అభిప్రాయాలనే మన తెలుగుభాషా సినీ ప్రేమికులు, విమర్శకులు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.