సహజంగా దర్శకత్వ శాఖపైనో మరో సినిమా రంగానికే చెందిన మరో డిపార్ట్‌మెంట్‌పై ఇంట్రెస్ట్‌తో వచ్చి హీరోలుగా, కమెడియన్లుగా, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన వారు టాలీవుడ్‌లో చాలామందే ఉన్నారు. కాగా కాలేజీ రోజుల్లో క్రికెట్ ప్లేయర్‌గా ఆల్‌రౌండర్ అని గుర్తింపు తెచ్చుకున్న తాను సినిమా ఫీల్డ్‌కి డైరెక్టర్ కావాలని వచ్చి ఆర్టిస్ట్‌గా మారినట్లు స్టార్ కమెడియన్‌గా ఎదుగుతున్న సప్తగిరి అంటున్నాడు. తాజాగా ఆయన హీరోగా మారి నటించిన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. గతంలో ఎందరో కమెడియన్లు హీరోలుగా మారి, ఆ తర్వాత హీరోలుగానే నటిస్తామనే పంతంతో తమ కెరీర్స్‌కే ముప్పుతెచ్చుకున్నారు.
కానీ అలీ, బ్రహ్మానందం వంటి వారు మాత్రం హీరోలుగా తమ వల్ల కాదని భావించి, మరలా కమెడియన్లుగా మారిపోయి తమ ఉనికిని నిలబెట్టుకున్నారు. 'ప్రేమకథా చిత్రమ్'తో కమెడియన్‌గా అందరి దృష్టిని ఆకర్షించి, సినిమా సినిమాకి కమెడియన్‌గా ఎదిగి, ప్రస్తుతం హీరోగా మారిన సప్తగిరి మాత్రం తాను కేవలం హీరో పాత్రలకే పరిమితం కానని, కమెడియన్‌గానే కాక అన్నిరకాల పాత్రల ద్వారా క్రికెట్‌లో లాగానే సినిమా ఫీల్డ్‌లో కూడా ఆల్‌రౌండర్ కావాలని ఉందంటున్నాడు. అంతేకాదు.. దర్శకత్వమే తన జీవిత లక్ష్యం అని కూడా చెబుతున్నాడు. మొత్తానికి ఇన్ని పడవల మీద కాలువేస్తే ఈ కమెడియన్‌గా కూడా భవిష్యత్తులో కష్టాలు తప్పేలా లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి.