'మనం. సోగ్గాడే చిన్నినాయన్నా, ఊపిరి'వంటి సూపర్ హిట్ చిత్రాలతో సీనియర్ స్టార్స్‌లో అందరికంటే రేసులో ముందున్నది కింగ్ నాగార్జున అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాగా తన ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో నాగ్ ప్రయోగాలు చేయడానికి కానీ, కొత్త వారికి అవకాశాలు ఇవ్వడానికి కూడా ఎప్పుడు జంకలేదు. అదే ఆయనను అందరిలో ప్రత్యేకంగా నిలిపింది. గతంలో పలు కమర్షియల్ చిత్రాలు నాగార్జున-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుల కాంబినేషన్‌లో వచ్చి మంచి విజయాలను నమోదు చేశాయి. ఈమధ్య కాలంలో వీరిద్దరు కలిసి 'అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీసాయి' వంటి భక్తిరస చిత్రాలను చేస్తూ కూడా సంచలనాలకు వేదికగా నిలుస్తున్నారు.
తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రియభక్తుడైన హథీరాంబాబా జీవిత చరిత్ర ఆధారంగా 'ఓం నమో వేంకటేశాయ'చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ టీజర్ పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. 'ఈ కొండపై ఎవరి మీద ఈగ వాలినట్లు తెలిసినా.. ఆ ఉగ్రశ్రీనివాసమూర్తి సాక్షిగా, జ్వాలా నరసింహుని సాక్షిగా, పదివేల శిరస్సుల పడగల బుసబుసల సాక్షిగా ఏం చేస్తానో చెప్పను... ' అంటూ నాగార్జున పలికిన డైలాగ్‌ను విన్నవారు ఎవరైనా ఈ ఇది ఏ బి.గోపాల్, వినాయక్, బోయపాటి వంటి మాస్ చిత్రాల దర్శకుల చేతిలో రూపొందుతున్న ఓ యాక్షన్, ఫ్యాక్షన్ చిత్రంలోని డైలాగ్ అనిపించకమానదు. కానీ ఇది ఓ భక్తిరస చిత్రమైన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రంలోని డైలాగ్ కావడమే ఇక్కడ ఉన్న ప్రత్యేకత.
సాధారణంగా హిస్టారికల్ మూవీస్ వంటి భక్తిరస చిత్రాలలో కూడా సినిమాటిక్‌గా తనదైన శైలిలో నవరసాలను చొప్పిస్తూ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా కాల్పనికత జోడించడంలో రాఘవేంద్రునిది ప్రత్యేకశైలి. అందుకే అది ఏ చిత్రమైనా రాఘ్ చేతిలో పడితే దానికి కమర్షియల్ హంగులు తప్పవు. నేటితరానికి, ట్రెండ్‌కు అది అవసరం కూడా. అదే పనిని ఈ చిత్రంలో కూడా ఆయన చేసి చూపించినట్లు అర్ధమవుతోంది. ఇలాంటి డైలాగ్‌తో ఈ చిత్రానికి ఆయన తనదైన మాస్ టచ్ ఇచ్చాడు. భక్తితో పాటు నవరసాలను జోడించి ఈ చిత్రానికి భక్తిరస చిత్రాల ప్రేక్షకులనే కాదు.... మాస్ ప్రేక్షకులకు కూడా ఫుల్‌మీల్స్ పెట్టనున్నాడని స్పష్టంగా తెలుస్తోంది.
ఇక గతంలో రాఘవేంద్రరావు -కీరవాణిల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. మరోసారి ఇదే కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ఓం నమోవేంకటేశాయ' ఆడియోపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఆడియోను జనవరి 8వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా నాగ్ ప్రకటించాడు. ఈ చిత్రం ఆడియో 'అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి'లను మించిన స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం థియేటికల్ ట్రైలర్‌ను కూడా ఆడియోతో పాటు విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.