ప్రస్తుతం దేశవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో జనవరి 26 హాట్‌టాపిక్‌గా మారింది. ఆ రోజున ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ ఒకేసారి బాక్సాఫీస్ యుద్దానికి రెడీ అవుతున్నారు. కింగ్‌ఖాన్ షారుఖ్ నటించిన మద్యం మాఫియా చిత్రం 'రాయిస్'తో పాటు మరో బాలీవుడ్‌స్టార్ హృతిక్‌రోషన్ నటించిన 'కాబిల్' చిత్రాలు విడుదలవుతున్నాయి. కాగా హృతిక్‌రోషన్, యామీగౌతమ్‌లు అంధులుగా నటించిన 'కాబిల్' చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టిస్తోంది.
ఈ ట్రైలర్‌కు విమర్శకులు, సెలబ్రిటీల నుంచే కాక సామాన్య ప్రేక్షకులను నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా హృతిక్ నటనను చూసిన వారు మంత్రముగ్దులై పోతున్నారు. వీరిలో సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ట్రైలర్‌లో హృతిక్ టాలెంట్‌ను, హార్డ్‌వర్క్‌ను చూసిన రజనీ ఆయనను పొగడ్తలతో ముంచెత్తాడు. సంజయ్‌గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర నిర్మాత, హృతిక్ తండ్రి రాకేష్‌రోషన్ ఈ చిత్రం మొదటి స్క్రీనింగ్‌ను రజనీకే చూపించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా అబ్బాయ్ హృతిక్ వెండితెరపై మొదటి సారిగా రజనీ నటించిన 'భగవాన్ దాదా' చిత్రంలో కనిపించాడు.
ఆ చిత్రం షూటింగ్ సమయంలోనే రజనీ సార్ మా అబ్బాయి నటనను చూసి, మీ వాడు పెద్ద స్టార్ అవుతాడన్నారు. నేడు ఆయన మాటే నిజం కావడం మాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. రజనీ నాకు మంచి స్నేహితుడు. కానీ సినిమాల బిజీ వల్ల ఈమధ్య నేను ఆయనతో మాట్లాడలేకపోతున్నాను. ఈ చిత్రం మొదటగా ఆయనకే చూపించాలని డిసైడ్ అయ్యానని చెప్పుకొచ్చాడు. కాగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో కూడా డబ్ చేసి హిందీ వెర్షన్‌తో పాటే విడుదల చేయనున్నారు. రజనీ ప్రశంసల నేపథ్యంలో ఈ చిత్రానికి తెలుగు, తమిళంలో మంచి ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకంతో రాకేష్‌రోషన్ ఉన్నాడు.