మెగాస్టార్ చిరంజీవి, హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవితలకు మద్య ఉన్న వైరం గురించి అందరికీ తెలుసు. తాను చేయాల్సిన కొన్ని చిత్రాలను.. ఉదాహరణకు 'ఠాగూర్' ( తమిళ 'రమణ') వంటి వాటిని చిరు తనవైపుకు లాక్కొని, వాటిని తనకు దూరం చేశాడన్నది రాజశేఖర్‌కు జీవితకు ఉన్న కోపానికి అసలు కారణం అన్నది కూడా జగమెరిగిన సత్యమే. చిరు 2009లో ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు రాజశేఖర్, జీవితలు చిరును నటుడిగా అభిమానిస్తామని, కానీ ఆయనకు రాజకీయ అనుభవం లేదు కాబట్టే రాజకీయంగా ఆయన్ను వ్యతిరేకిస్తున్నామని చెప్పి, కాంగ్రెస్ పార్టీలో చేరి చిరుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
ఇవన్నీ ఇప్పుడెందుకంటే... తాజాగా జీవిత ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆనాటి సంగతులను మరలా గుర్తుచేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిరుకు రాజకీయ అనుభవం లేదు కాబట్టే తాము ఆ నిర్ణయం తీసుకున్నామని, రాజకీయాలలో ఎవరి అభిప్రాయాలు వారికుంటాయని తెలిపింది. కానీ దీనికి చిరు ఫ్యాన్స్ ఓవర్‌గా రియాక్ట్ అయ్యారని మరోసారి ఆ వివాదాన్ని గెలికింది. తమపై ఆయన అభిమానులు దాడి చేసిన ఘటనను గుర్తుచేసింది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత చిరు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో తమకి రాజకీయాలంటే ఏమిటో అర్ధమయ్యాయని, అందుకే తాము కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం బిజెపిలో ఉన్నామని వ్యాఖ్యానించింది. ఇక ప్రస్తుతం తమకు, చిరు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని కొసమెరుపునిచ్చింది.
అయితే చిరును రాజకీయంగా విమర్శిస్తే ఎవ్వరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఈ సినీ జంట మాత్రం ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా వివాదాల్లోకి లాగారు. చిరుపై, పవన్‌పై వ్యక్తిగతమైన ఆరోపణలు చేశారు. చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌పై కూడా అనేక ఆరోపణలు చేశారు. దీంతోనే మెగాభిమానులు కాస్త ఓవర్ రియాక్ట్ అయ్యారన్న విషయాన్ని ఆమె మర్చిపోయారు. ఈ జంట ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగిన వెంటనే, ఆ దాడిని నిజంగా మెగాభిమానులే చేశారా? లేదా? అనేది కూడా నిర్దారణ కాకుండానే వీరు నానా రచ్చ చేశారు. అయినా చిరు మాత్రం స్వయంగా తానే వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన విషయాన్ని మాత్రం ఆమె మర్చిపోయారు. గతంలో జరిగింది అంతా సద్దుమణుగుతున్న సమయంలో ఆ వివాదాన్ని అక్కడితో వదిలేయకుండా, ప్రస్తుతం చిరుతో తమకు మంచి సంబంధాలే ఉన్నాయని చెబుతూ, మరోవంక పాత రగడను మరలా గెలికేలా జీవిత మాట్లాడటానికి ఇది సందర్భం కాదనే చెప్పాలి.