సినిమా హీరోలకు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునే గుణం, హిట్ వచ్చినప్పుడు అది ఎందువల్ల హిట్ అయిందో విశ్లేషించుకునే తత్వం చాలా అవసరం. సినిమా ఫీల్డ్‌లో జయాపజయాలు సర్వసాధారణం. వాటికి అతీతంగా తమ ఆలోచనలకు పదునుపెడుతూ, తాము చేసే చిత్రాల ఎంపికల విషయంలో జాగ్రత్తలు తీసుకునే గుణం, విమర్శకుల విశ్లేషణలను కూడా పరిగణనలోకి తీసుకొని, వాటిని పాజిటివ్ మైండ్‌తో స్వీకరించే అలవాటు చేసుకోవాలి. కానీ నేటితరం హీరోలు విమర్శలను సహృదయంతో తీసుకోలేక, తమ ఇగోతో కెరీర్స్‌ను నాశనం చేసుకుంటున్నారనేది వాస్తవం. ఒక్క విమర్శను కూడా తట్టుకోలేకపోవడంతో పాటు ఒక్క హిట్ వస్తే దానికి తామే కారణమని గర్వం తలకెక్కించుకుంటున్నారు. దాంతో ఒక్కసారిగా దూకుడు పెంచుతున్నారు.
అదే ఒక్క ఫ్లాప్ ఎదురైతే చాలు సందిగ్దంలో పడిపోతూ సరైన నిర్ణయాలు తీసుకోలేక, ఆయా పరాజయాల కారణాలను విశ్లేషించుకోలేక సతమతమవుతున్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎనర్జిటిక్ హీరోగా ఎదుగుతున్న రామ్ గురించి. అభిరుచిగల నిర్మాతగా పేరుతెచ్చుకున్న 'స్రవంతి' రవికిషోర్ ఫ్యామిలీ నుంచి వచ్చి, ఆయన అండదండలతో హీరోగా నిలబడే సమయంలో ఆయనకు కొన్ని విజయాలు లభించాయి. దాంతో ఇక పవన్‌కళ్యాణ్‌ను, రవితేజను ఇమిటేట్ చేస్తూ వచ్చి తన ఓన్ ఐడెంటిటీ కోల్పోయాడు. ఆ తర్వాత వరుస పరాజయాలతో సతమతమయ్యాడు. ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి1వ తేదీన నూతన సంవత్సరం ఆరంభం రోజునే 'నేను...శైలజ' చిత్రంతో చాలాకాలం తర్వాత హిట్టందుకున్నాడు. దాంతో మరలా ఆయన మాస్‌హీరోగా పేరుతెచ్చుకోవాలనే తాపత్రయంతో సంతోష్‌శ్రీనివాస్ తనకు 'కందిరీగ' వంటి మరో హిట్ ఇస్తాడని భావించి 'హైపర్' చిత్రం చేశాడు.
ఈ చిత్రం సమయంలో ఆయన దూకుడు పెంచి తాను అనిల్‌రావిపూడి, కరుణాకరన్‌లతో కూడా చిత్రాలు చేయబోతున్నట్లు ఆర్భాటంగా ప్రకటించాడు. కానీ 'హైపర్' డిజాస్టర్‌తో ఈయన మరోసారి డిప్రెషన్‌లోకి వెళ్లాడు. అనిల్‌రావిపూడి చిత్రాన్ని ఆదిలోనే అటకెక్కించాడు. దాంతో ఆయన తనకు 'ఎందుకంటే ప్రేమంట' అనే ఫ్లాప్‌ను ఇచ్చిన లవ్‌మూవీస్ స్పెషలిస్ట్ కరుణాకరన్‌తోనే తన తదుపరి చిత్రం చేయనున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం రామ్‌కు కరుణాకరన్ చిత్రం కథ విషయంలో కూడా పలు అనుమానాలతో ఉన్నాడని, అందుకే ఆ చిత్రం విషయంలో ఏ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరలా ఆయన మరికొందరు డైరెక్టర్లు చెబుతున్న కొత్త కథలు వింటూ, వాటిల్లో మునిగిపోయాడట ఈ కన్‌ఫ్యూజన్ మాస్టర్ రామ్.