సహజంగా ప్రతీకార కథలలో ప్రతినాయకుడి ఆగడాలకు ఎదురు వెళ్లి కథానాయకుడు యుద్ధం గెలవటం సాధారణంగా కనిపించే అంశం. ఈ అంశం తో పాటు అంతర్లీనంగా వేరే ఏదైనా కథ చెప్తుంటారు దర్శకులు. అయితే ఈ సూత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలకు పూర్తిగా వర్తించదు కానీ ఏదో ఒక సబ్ ప్లాట్ లోనైనా ఇటువంటి ప్రతీకార నేపధ్యానికి తావుంటూ ఉంటుంది. కానీ ప్రతీకార చర్యలతో రగిలిపోయిన ఒక ప్రాంతంలోని గొడవలను తెరకెక్కిస్తూ ఆ చిత్రంలో అసలు కథానాయకుడు, ప్రతినాయకుడు అంటూ ఎవరు లేకపోతేనో? విడ్డూరంగా వుంది కదూ! సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీన్ని సాధ్యం చేసి చూపించారు.
వంగవీటి చిత్రంలో ఆర్.జి.వి. పూర్తిగా పరిస్థుతుల ప్రభావం చేత విజయవాడ నగరంలో రౌడీయిజం, వర్గ పోరు రాజ్యం ఏలిందే తప్ప ఏ ఒక్క వ్యక్తి అనుకుని చేసిన పొరపాటు కాదు అనే విధంగా వంగవీటి చిత్రం తెరకెక్కించారు. వంగవీటి చిత్రం ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు ఏ వర్గం కోణం నుంచి వర్మ ఈ కథను చెప్పనున్నారు అనేది అందరికి వున్న ఆసక్తి . టైటిల్ వంగవీటి అని పెట్టినప్పటికీ వర్మ కి దేవినేని వర్గీయులతో వున్న సాన్నిహిత్యం కారణాన ఈ చిత్రం దేవినేని వర్గీయులకు అనుకూలించేలా పతాక సన్నివేశాలు ఉంటాయి అని అందరూ ఊహించారు. కానీ వర్మ అటువంటి భారం, బాధ్యత ఏది తనపై పెట్టుకోకుండా వంగవీటి మోహన రంగ హత్యలో నిందితులు ఎవరన్నది బెజవాడ కనక దుర్గమ్మ కి తప్ప మరెవరికి తెలీదు అంటూ చిత్రాన్ని ముగించేశాడు. అప్పటి వరకు సాగిన కథ కూడా వంగవీటి రాధా, రంగ లకు కానీ దేవినేని గాంధీ, నెహ్రు, మురళి లలో ఏ ఒక్కరికి వ్యతిరేకంగా సాగదు. మొత్తానికి చాలా సున్నితమైన అంశాన్ని ఎవరి భావోద్వేగాలకు తావివ్వకుండా బ్యాలన్సుడ్ గా తెరకెక్కించటంలో సక్సెస్ అయ్యాడు వర్మ.