తెలుగు భాషలో నిర్మితమైన అగ్ర కథానాయకుల చిత్రాలకు పది కాలాల పాటు శ్రోతలు గుర్తుంచుకునే అద్భుతమైన సంగీతాన్ని అందించిన స్వర బ్రహ్మ మణి శర్మ ఇటీవలి కాలంలో అడపాదడపా సినిమాలు చేయటం తప్పితే గతంలో చేసినట్టు నిరంతరాయంగా చిత్రాలకు సంగీతం సమకూర్చటం లేదు. కృష్ణం వందే జగద్గురుమ్ వంటి కంటెంట్ రిచ్ సినిమాలు తన వద్దకు వస్తే మాత్రం కాదనకుండా సంగీతం సమకూరుస్తున్నారు మణి శర్మ. దీనితో యువ సంగీత దర్శకులు ఐన దేవి శ్రీ ప్రసాద్, ఎస్.ఎస్.థమన్ లకు వరుస అవకాశాలు లభించాయి. అయితే అందరి సినిమాలకు దేవి శ్రీ ప్రసాదే తొలి ఆప్షన్ అవుతుండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేక కొన్ని అవకాశాలు వదులుకుంటున్నాడు. మరో వైపు థమన్ సంగీతానికి మార్కెట్ క్రమంగా తగ్గుతుంది.
ఈ గ్యాప్ ని ఫిల్ చేయటానికి అనూప్ రూబెన్స్, మిక్కీ.జె.మేయర్ వంటి వారు ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యపడలేదు. తమిళంలో ఏకంగా కమల్ హాసన్ దృష్టిని ఆకర్షించి వరుసగా కమల్ నటించిన నాలుగు చిత్రాలు విశ్వరూపం, పాపనాశం, చీకటి రాజ్యం, ఉత్తమ విలన్ చిత్రాలకు సంగీత దర్శకత్వ అవకాశాలు పొందిన జిబ్రాన్ కు తెలుగులోనూ రన్ రాజా రన్, జిల్, బాబు బంగారం వంటి పలు మంచి అవకాశాలే వచ్చాయి. కానీ ప్రస్తుతం జిబ్రాన్ చేతిలో ఒక్క తెలుగు సినిమా అవకాశం కూడా లేకపోవటం గమనార్హం. ఇక ఈ తరుణంలో తమిళ చిత్ర పరిశ్రమలో అతి పిన్న వయసులో అగ్ర సంగీత దర్శకుడిగా ఎదిగిన అనిరుద్... పవన్ కళ్యాణ్ చిత్రం ద్వారా తెలుగు కు పరిచయం అవుతుండటంతో, ఆ చిత్రంతో నిరూపించుకుంటే ఇక తెలుగులో వరుస అవకాశాలతో దేవి శ్రీ ప్రసాద్ కి పోటీ గా నిలిచే అవకాశం కూడా ఒక్క అనిరుద్ కే ఉంటుంది. మరి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కనిపిస్తున్న సంగీత దర్శకుల కొరతను అనిరుద్ తన కెరీర్ కు ఎలా ప్లస్ చేసుకుంటాడో చూడాలి.