మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 'మా డైరీ-2017' ఆవిష్కరణ
మూవీ ఆర్టిస్టుల సంఘం అధికారిక డైరీ 'మా డైరీ-2017'ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మెగాస్టార్ స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, 'మా' అధ్యక్షులు డా.రాజేంద్రప్రసాద్, 'మా' ప్రధాన కార్యదర్శి శివాజీరాజా, హీరో శ్రీకాంత్, సీనియర్ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, సంతోషం అధినేత సురేష్ కొండేటి, 'మా' ఈసీ మెంబర్స్ శివకృష్ణ, బెనర్జీ, కాదంబరి కిరణ్, ఏడిద శ్రీరామ్, జాకీ, శ్రీశశాంక.జి, జయలక్ష్మి, హేమ, మా డైరీ స్పాన్సరర్స్ అయిన అపోలో ప్రతినిధులు, శ్రీ మిత్ర చౌదరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని 'మా' బృందం శాలువా కప్పి సత్కరించింది. 'ఖైదీనంబర్ 150' చిత్రంతో పునరాగమనం చేస్తున్నందుకు కేక్ కట్ చేసి గ్రాండ్ వెల్‌కం చెప్పింది. ఈ సందర్భంగా 150 గులాబీలతో కూడిన పుష్పగుచ్ఛాన్ని మెగాస్టార్ చిరంజీవికి మా అధ్యక్షకార్యదర్శులు అందించారు. అనంతరం మెగాస్టార్ 'మా డైరీ' ని ఆవిష్కరించారు.
కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ- మా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి శివాజీరాజా సారథ్యంలోని టీమ్ ఎన్నో మంచి పనులు చేస్తూ పేరు తెచ్చుకుంటోంది. రాజేంద్రుడు ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు 'మా' బాధ్యతల్ని చక్కగా నెరవేరుస్తున్నారు. ఆర్టిస్టుల్లో ప్రతి ఒక్కరూ మెచ్చుకునేలా 'మా' ని నడిపిస్తున్నారు. అంతా గర్వించేలా చేస్తున్నారు. ఇంకా ఇంకా మంచి పనులెన్నో చేయాలి. 'మా' అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్‌గా వారిని ప్రత్యేకించి అభినందిస్తున్నా. అందరికీ క్రిస్మస్, కొత్త సంవత్సర శుభాకాంక్షలు.. అని తెలిపారు. మరిన్ని సంగతులు ముచ్చటిస్తూ -ఖైదీనంబర్ 150 చిత్రంతో తిరిగి పునప్రవేశం చేసినందుకు నన్ను ఉత్సాహపరుస్తూ 150 గులాబీలతో పుష్పగుచ్ఛాన్ని ఎంతో ప్రేమాభిమానాలతో తమ్ముళ్లంతా అందించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. తమ్ముళ్ల ప్రేమ మురిపిస్తోంది. కళామతల్లి ముద్దుబిడ్డలుగా నాపై ప్రేమ కురిపిస్తున్నందుకు మైమరిచిపోతున్నా. మీరంతా గర్వించేలా.. ఇదిరా చిరంజీవి అనేలా సినిమా ఇస్తాను. ది బెస్ట్ పెర్ఫామెన్స్‌ని ఇస్తాను. ఖైదీ నంబర్ 150 ప్రతి ఒక్కరినీ అలరించే చిత్రమవుతుంది.. అన్నారు.
'మా' అధ్యక్షులు డా.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ - మా అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా చేస్తున్నందుకు 'మా' తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.. అన్నారు. మా ప్రధాన కార్యదర్శి శివాజీరాజా మాట్లాడుతూ - అన్నయ్య చేతులమీదుగా మా డైరీని ఆవిష్కరించడం సంతోషాన్నిస్తోంది..అన్నారు.