వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రచారం కోసం సోనియా కూతురు ప్రియాంక గాందీకి కీలక బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యూపీ ఎన్నికల ప్రచారానికి ప్రియాంకను రంగంలోకి దింపాలని భావించిన కాంగ్రెస్, అలాగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కూడా ప్రియాంకతో జరిపితే కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ప్రియాంక గాంధీకి ప్రచారం బాధ్యతలు అప్పగిస్తే సమర్థవంతంగా న్యాయం జరుగుతుందని పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ సందర్భంగా మాజీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అనుభవజ్ఞుడు అయిన జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గురించి, ప్రియాంక గాంధీ గురించి కొన్ని రసవత్తరమైన కామెంట్లు చేశాడు. ప్రస్తుతం చూస్తే కాంగ్రెస్ పార్టీ నిజంగా అంపశయ్య మీదే ఉందని, అది బ్రతికి బట్టకట్టాలంటే పార్టీ, సోనియాగాంధీ చేతిల్లోంచి బయటపడితే కాస్త నయం అని దిమ్మతిరిగిపోయే స్టేట్ మెంట్ ఇచ్చాడు జేసీ. అంతే కాకుండా ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ పార్టీలో చురుకైన రోల్ ఇవ్వాలని చూస్తున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ... ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ వచ్చినా పని జరగదు. అప్పట్లో అంటే ప్రియాంక పెళ్లికి ముందు, పెళ్లయిన కొత్తలో.. ప్రియాంక గాంధీని చూస్తే స్వచ్చంగా, ఇందిరాగాంధీని చూసినట్టుగా ఉండేది. మరిప్పుడు ఆమె ఆంటీ అయిపోయింది. ఈ సందర్భంలో ప్రియాంకకు కీలక రోల్ అప్పగిస్తే కూడా చాలా కష్టంతో కూడుకున్న పని అని వెల్లడించాడు. అప్పుడేగానీ... ప్రజల్లో బలంగా సెంటిమెంటు ఉన్నప్పుడు వర్కవుటయ్యుండేది అంటూ తన మనసులో మాటను టకీమని నిర్భయంగా బయటకు అనేశాడు జేసీ దివాకర్ రెడ్డి. ఇంకా ఆయన మాట్లాడుతూ ఇప్పట్లో తెలంగాణలో గానీ, ఏపీలోగానీ కాంగ్రెస్ పార్టీ కోలుకునే స్థితిలో లేదని ఆయన తెలిపాడు.