ప్రధానమంత్రి నరేంద్రమోడీ నవంబర్ 8న సడెన్‌గా తీసుకున్న నిర్ణయంతో దేశం, ప్రభుత్వాలు, ప్రజలు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ముఖ్యంగా కొత్త నోట్లు సరిపోక.. ఏటీఎమ్‌ల చుట్టూ ప్రజలు తిరుగుతుంటే, బ్యాంకర్లను గుప్పిట్లో పెట్టుకున్న అధికారులు వచ్చిన డబ్బును వచ్చినట్లు దాచేసుకుంటున్నారు. డెసిషన్ తీసుకుని తప్పుకున్న మోడీ..అక్రమంగా దొరికిన సొమ్మును, అలా ఎందుకు జరిగింది అనే విషయాన్ని నిగ్గు తేల్చడంలో మాత్రం సరైన ప్రణాళికను అమలు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం చూస్తుంటే ప్రతి రోజూ ఏదో ఒక చోట కోట్లలో డబ్బు దొరుకుతుండటమే దీనికి ఉదాహరణ.
సరే..ఆ విషయాలన్నీ రోజూ వార్తల్లో వినిపించేవేలే కానీ..అసలు ఈ సమస్య ఎప్పటి వరకు ఉంటుందనేది ఒకసారి పరిశీలిస్తే..ఈ నోట్ల సమస్య డిసెంబర్ 31తో తీరేట్లు అయితే మాత్రం కనిపించడం లేదు. మోడీ నిర్ణయం తీసుకుని ఇప్పటికే 40 రోజులు పైబడినా..సామాన్యులు ఇంకా నోట్ల కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు. ఆర్బీఐ లెక్కల దృష్ట్యా..సామన్యులకు డబ్బు అందడానికి, కొత్తగా వచ్చిన నోట్లు వాడుకలోకి రావడానికి మార్చి వరకు టైమ్ పడుతుందని చెబుతున్నారు ఆర్ధిక నిపుణులు. అంతే కాకుండా ఈ నోట్ల రద్దు విషయం ముందే తెలిసిన వ్యక్తిగా చెప్పుకోబడుతున్న ముఖేష్ అంబానీ కూడా తన జియో ఆఫర్‌ని మార్చి వరకు పొడిగించడం కూడా దీనికి బలాన్ని చేకూరుస్తుంది. ఇప్పటికే లైన్లలో నిలబడి విసిగి వేసారి పోతున్న ప్రజలకి..ఇంకా మార్చి వరకు ఈ కష్టాలు తప్పవని ప్రభుత్వం చెప్పడానికి కూడా భయపడుతుంది. నిజంగానే మార్చి వరకు ఇలాంటి కష్టాలే ఉంటే..సామాన్య ప్రజలు మరిన్ని ఇక్కట్లు అనుభవించక తప్పదు మరి.