తమిళంలో ఒకప్పుడు హీరోగా ఒక ఊపు ఊపిన అరవింద్ స్వామి తెలుగు అమ్మాయిలకు కలల రాకుమారుడిగా ఒక వెలుగు వెలిగాడు. 'రోజా, బొంబాయి' వంటి చిత్రాల ద్వారా తానేమిటో నిరూపించుకున్న అరవింద్ స్వామి కొన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీ కి పూర్తిగా దూరమయ్యాడు. ఏవో ఆరోగ్య కారణాల రీత్యా తాను సినిమాలకు దూరమయ్యానని అరవింద్ స్వామి ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఇక రీసెంట్ గా అరవింద్ స్వామి తమిళంలో మళ్ళీ ఒక పవర్ ఫుల్ విలన్ పాత్ర ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. 'తని ఒరువన్' లో విలన్ గా నటించి శభాష్ అనిపించాడు.
'తని ఒరువన్' ని తెలుగులో రామ్ చరణ్ - సురేందర్ రెడ్డి లు 'ధ్రువ' గా రీమేక్ చేశారు. ఈ తెలుగు వెర్షన్ లో కూడా అరవింద్ స్వామే విలన్ గా నటించి మళ్ళీ తెలుగు ప్రేక్షకులని మెప్పించాడు. ఫేస్ ఎక్సప్రెషన్ తో ఎంతో స్టైలిష్ లుక్ లో అరవింద్ స్వామి విలన్ గా కేక పుట్టించేసాడు. ఇంకేమిటి అరవింద్ స్వామికి తెలుగులో ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడ్డాయి. ఏకంగా 15 సినిమాల్లో ఆఫర్స్ వచ్చినట్టు ప్రచారం కూడా జరిగింది. అయితే అరవింద్ స్వామి టాలీవుడ్ కి బిగ్ షాక్ ఇచ్చాడు. తాను అసలు తెలుగు చిత్రాల్లో నటించలేనని చెబుతున్నాడు. అయితే దానికి కారణం కూడా లేకపోలేదని అంటున్నాడు. తనకి తెలుగు భాష రాకపోవడం వల్ల తాను చేస్తున్న పాత్రలకు న్యాయం చేయలేనని.... భాష రాకుండా ముఖం లో హావభావాలు పలికించడం కష్టమని అందుకే ఇలాంటి నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నాడు.
అందుకే తెలుగులో ఆఫర్స్ ని తిరస్కరిస్తున్నట్లు చెబుతున్నాడు. అయితే తమిళంలో కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తి కాగానే ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తానని... ఇప్పటికే ఒక కథని కూడా ప్రిపేర్ చేశానని చెబుతున్నాడు. అరవింద్ అలా తెలుగులో నటించనని చెప్పి చాలామంది ప్రేక్షకులని హార్ట్ చేసాడని అభిప్రాయపడుతున్నారు.