అంతర్జాలం అందుబాటులో లేని రోజుల్లో పర భాషల్లో బాగా ఆడిన చిత్రాలు మన ప్రేక్షకులకి అందుబాటులో రావటానికి వున్న ఏకైక మార్గం రీమేక్. అప్పట్లో ముందుగా ఒరిజినల్ వెర్షన్ చూసే అవకాశం లేకపోవటంతో తెలుగులో రీమేక్ ఐన చిత్రాన్ని చూసి మన తెలుగు కథే అనే అంతగా ఆరాధించే వాళ్ళు ప్రేక్షకులు. తెలుగులో అసాధారణమైన విజయాలు సాధించిన చంటి, పెద్ద రాయుడు వంటి చిత్రాలు కూడా రీమేక్ చిత్రాలే. కానీ ప్రస్తుతం అరచేతిలో అంతర్జాలం అందుబాటులో ఉండటంతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. పొరుగు రాష్ట్రాలలో నిర్మితమైన చిత్రాలే కాక ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో ఏ భాషలో నిర్మితమైన చిత్రాన్నైనా వీక్షించే వెసులుబాటు నేటి తరం ప్రేక్షకుడికి కలుగుతుంది. రీమేక్ విడుదలకి ముందే ఒరిజినల్ వెర్షన్ చూసేసి ఒరిజినల్ వెర్షన్ తో పోలికలు పెట్టి రీమేక్ వెర్షన్ ని చూస్తున్నారు ప్రేక్షకులు. కాబట్టి రీమేక్ చిత్రాలకు ప్రతి ప్రేక్షకుడు విమర్శకుడే అనే రీతిలో ముందుగానే ప్రిపేర్ ఐపోతున్నారు దర్శకులు.
తాజాగా విడుదలై సూపర్ సక్సెస్ దిశగా దూసుకుపోతున్న తన్ని ఒరువన్ రీమేక్ ధృవ ని తెరకెక్కించిన దర్శకుడు సురేంద్ర రెడ్డి ధృవ చిత్రానికి దక్కిన ప్రేక్షకాదరణ కు కృతజ్ఞత తెలుపుతూ, 'తన్ని ఒరువన్ చిత్రం చాలా మంది తెలుగు ప్రేక్షకులు ముందుగానే చూసేసారు. వారికి కథ మొత్తం తెలుసు. కానీ వారు మళ్లీ ధృవ చిత్రాన్ని చూడటానికి ఆసక్తి చూపింది కేవలం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గ విధంగా ఎటువంటి మార్పులు చేస్తామా అనే. ఒరిజినల్ లో జయం రవి పాత్ర చాలా సాధా సీదాగా ఉంటుంది. విలన్ పాత్రలో వుండే ఇంటెలెక్చవాలిటీ ఆధారంగా కథనం సాగుతుండటంతో అరవింద్ స్వామి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మోహన్ రాజా. కానీ మన దగ్గర చెర్రీ పాత్ర అలానే ఉంటే ప్రేక్షకులు అంగీకరించరు. అందుకే విలన్ కి ధీటుగా ఆరంభం నుంచే చెర్రీ పాత్రను ఎస్టాబ్లిష్ చేసాం. ధృవ చుసిన వారు కథ తో పాటు చేసిన మార్పులు చేర్పులను కూడా అభినందిస్తుండటం ఆనందంగా వుంది. రీమేక్ తీసిన డైరెక్టర్ కోరుకునేది కూడా అదే కదా. కథ పక్క దారి పట్టకుండా నా ముద్ర కనిపించే విధంగా ధృవ ను తెరకెక్కించాను. ఫలితంతో పడ్డ శ్రమంతా మర్చిపోతున్నాను.' అని విజయానందాలను పంచుకున్నారు దర్శకుడు సురేంద్ర రెడ్డి.